నిన్న చందానగర్‌.. నేడు వనస్థలిపురం!

రెండు నెలల వ్యవధిలోనే రెండు చోరీలు.. ఒకటి మరువక ముందే.. మరొకటి.. నిన్న చందానగర్‌.. నేడు వనస్థలిపురం. నగరంలో ఏటీఎం చోరీలు దడ పుట్టిస్తున్నాయి. ..

Updated : 17 Nov 2020 12:51 IST

రెండు నెలలు.. రెండు ఏటీఎంల్లో చోరీ

హైదరాబాద్‌: రెండు నెలల వ్యవధిలోనే రెండు చోరీలు.. ఒకటి మరువక ముందే.. మరొకటి.. నిన్న చందానగర్‌.. నేడు వనస్థలిపురం. నగరంలో ఏటీఎం చోరీలు దడ పుట్టిస్తున్నాయి. ప్రధాన రహదారిపై ఉన్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పంజా విసురుతున్నారు.

పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే..

అక్టోబర్‌ 5న హైదరాబాద్‌ - ముంబయి ప్రధాన రహదారిపై చందానగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సుమారు రూ.15 లక్షల చోరీ జరిగింది. దొంగలు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో లోపలికి ప్రవేశించి షట్టర్‌ మూసి యంత్రాన్ని తెరిచి డబ్బులు కాజేసి పరారయ్యారు. ఈ ఏటీఎం చందానగర్‌ ఠాణాకు కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.

ఎందుకిలా..?

దేశంలోని అన్ని ఏటీఎం కేంద్రాలు ముంబైలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. ట్యాంపరింగ్‌కు పాల్పడినా, ధ్వంసం చేసేందుకు యత్నించినా వెంటనే అలారం మోగుతుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అత్యవసర మెసేజ్‌ మేనేజర్‌కు చేరుతుంది. మేనేజర్‌ పోలీసులను అప్రమత్తం చేస్తారు. నగరంలో సెన్సార్లుతో కూడిన కొత్త యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఏటీఎం ధ్వంసం.. రూ.8 లక్షలు అపహరణ

వనస్థలిపురం: వెల్డింగ్‌ మిషన్‌తో ఏటీఎంను కోసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన వనస్థలిపురంలో కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసుల వివరాల ప్రకారం సహారాస్టేట్స్‌ రోడ్డులోని ఎంఈరెడ్డి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాలు ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం రాత్రి 2.30 సమయంలో దుండగులు ప్రవేశించి ఏటీఎంను వెల్డింగ్‌ మిషన్‌తో పగలగొట్టారు. రూ.8 లక్షలు ఎత్తుకెళ్లారు. కింద భాగం తెరచుకోకపోవడంతో రూ.1.1లక్షలను వదిలివెళ్లారు. ఫుటేజీ దొరక్కుండా సీసీ కెమెరాల బాక్స్‌ను తీసుకెళ్లారు. ఎర్టిగా కారులో ఐదుగురు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, క్రైమ్‌ డీసీపీ యాదగిరిరెడ్డి, ఏసీపీ శంకర్‌ పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని