మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యు ఒడికి

మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో పడి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన  కామారెడ్డి

Updated : 27 Jun 2021 09:33 IST

మంజీరా నదిలో పడి నలుగురు మృతి

బీర్కూర్‌: మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో పడి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన  కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామానికి చెందిన గంగారాం, మారుతి ఇద్దరు అన్నదమ్ములు. గంగారాం భార్య అంజవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీర్కూర్‌లోని గైపీర్ల దర్గాలో మొక్కు చెల్లించాలని అంజవ్వ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన చిన్న కుమార్తె సోని (17)ని తీసుకుని శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్గాకు బయలుదేరింది. వారిని చూసిన మారుతి పిల్లలు గంగోత్రి (11), ప్రశాంత్‌ (7) కూడా వారితో కలిసి దర్గా వద్దకు వెళ్లారు.

మార్గమధ్యంలో వారందరూ బీర్కూరు-షెట్లూరు గ్రామాల మధ్యలో ఉన్న మంజీరా నది వద్దకు చేరుకున్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉందని భావించి నది దాటే ప్రయత్నం చేశారు. నది దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురూ మంజీరా నదిలో చిక్కుకుపోయారు. రాత్రి కావస్తోన్నా వారు  ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్‌ చేసినా స్పందన లేదు. వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం నదిలో ముగ్గురి మృతదేహాలు కొట్టకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజవ్వ, సోని, ప్రశాంత్‌ మృతదేహాలుగా గుర్తించారు. అనంతరం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా గంగోత్రి మృతదేహం కూడా లభ్యమైంది. ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

టీఎస్‌ ఎండీసీ ఆధ్యర్యంలో ఏడాది కాలంగా నది పరిసరాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. తమ పిల్లలను ఇసుక గుంతలే బలితీసుకున్నాయని మృతుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ జైపాల్‌ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్‌, సీఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తమ పిల్లల మృతికి కారకులైన క్వారీ నిర్వాహకులు పరిహారం చెల్లించేదాకా మృతదేహాలను తీసేది లేదని ఘటనా స్థలంలోనే బైఠాయించారు. చివరకి పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాలను బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమెదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని