Terror attack: ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్‌.. గణపతి నిమజ్జనాల వద్ద ముష్కరుల రెక్కీ!

దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు దిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది......

Updated : 16 Sep 2021 02:34 IST

దిల్లీ: దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు దిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. ఉగ్రవాదులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్  విధించింది. ముష్కరులను జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ అమీర్ జావేద్‌గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు ముష్కరులను మస్కట్ మీదుగా పాక్  తీసుకెళ్లి.. బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్ర దాడులు చేసేవిధంగా నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు.

అలీ షేక్, మూల్ చాంద్‌లకు అండర్ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు, పాక్‌లో నివసిస్తున్న అనీస్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాల సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. ఉగ్ర మూకల లక్ష్య జాబితాలో హిందూత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరు వినాయక నిమజ్జనాలు, రైల్వేస్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పండుగలను లక్ష్యంగా చేసుకొని భారత్‌లో భారీ పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. అందులో భాగంగానే.. ముంబయిలో పుట్టి పెరిగిన జాన్ మహమ్మద్ అలీ షేక్ దక్షిణ ముంబయి ప్రాంతంలో కొద్ది రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులు తెలిపారు. అతడు ఏళ్లపాటు ముంబయిలో డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్‌ రైల్వేస్టేషన్లలోనూ అతడు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని