Crime news: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం..మరో 11మంది బలి

బిహార్‌లోని నలంద జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి....

Published : 17 Jan 2022 01:35 IST

పట్నా: బిహార్‌లోని నలంద జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి తాజాగా మరో 11మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి నలంద పట్టణంలోని చోటి పహరి, పహరితల్లి ప్రాంతాల్లో మద్యం తాగిన శనివారం ఉదయం నలుగురు తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు అదే రోజు సాయంత్రం; ఆదివారం ఉదయం ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు నలంద జిల్లా ఎస్పీ అశోక్‌ మిశ్రా అన్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందిన ఎస్‌హెచ్‌వోను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉదయం మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించినట్టు చెప్పారు.

బిహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, గత రెండు నెలల వ్యవధిలోనే ఉత్తర బిహార్‌లోని నాలుగు జిల్లాల్లో ఈ రక్కసికి దాదాపు 40మందికి పైగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో నీతీశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ జేడీయూ నేతలపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, మద్యం మాఫియాల మధ్య సంబంధాలను ఛేదించే దాకా ఈ అక్రమ మద్యం రక్కసిని నియంత్రించలేమని జేడీయూ నేతలు గుర్తిస్తే మంచిదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని