థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం:17మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు...

Updated : 11 Oct 2020 14:50 IST

మరో 29 మందికి గాయాలు

చాచియాంగ్‌సావో: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు థాయ్‌ అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్‌ నుంచి చాచియాంగ్‌ సావోలోని ఆలయం వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 65 మందితో వెళ్తున్న పర్యాటక బస్సు రైల్వే ట్రాక్‌ను దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టినట్లు వివరించారు. వర్షం పడుతుండటంతో రైలు వస్తున్నట్లు బస్సు డ్రైవర్‌ గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాయి.

రైల్వే ట్రాక్‌ల పక్కన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. రైలు ఢీకొనడంతో బస్సు తిరగబడిందని క్రేన్ సాయంతో యథాస్థితిలోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. 2018లో డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో థాయ్‌లాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ద్విచక్ర వాహనదారులు, బస్సు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంటారని పేర్కొంది. రెండేళ్ల కిందట చెట్టును బస్సు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా.. పది మందికిపైగా గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని