Crime News: ఇస్మార్ట్‌ దొంగలు 

చెన్నైలోని వేలచేరి, ధరమణి, వలసరవక్కం, రామాపురం ప్రాంతాల్లో దొంగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకుని నగదు కాజేస్తున్నారు.

Published : 23 Jun 2021 08:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చెన్నైలోని వేలచేరి, ధరమణి, వలసరవక్కం, రామాపురం ప్రాంతాల్లో దొంగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకుని నగదు కాజేస్తున్నారు. దొంగతనం జరిగినట్టు కూడా తెలియకుండా తెలివిగా ఏటీఎంలను కొల్లగొడుతున్నారు. బ్యాంకు అధికారుల లెక్కల్లో డిపాజిట్‌ యంత్రాల్లోని సొమ్ము లక్షల్లో గల్లంతైనట్టు తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యంత్రాలలో డిపాజిట్‌ చేసిన నగదు, ఏటీఎం నుంచి తీసిన డబ్బుతో టాలీ కాకపోవడంతో అధికారులు గ్రేటర్‌ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఏటీఎం యంత్రాల్లో చిన్న లోపాన్ని కనిపెట్టిన దొంగలు తెలివిగా ఈ దొంగతనాలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చోరీకి గురైన ఏటీఎంలు జపాన్‌కు చెందిన ఓ సంస్థ తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఏటీఎం యంత్రాల్లో పిన్‌ ఎంటర్ చేశాక డబ్బు తీయడానికి 20 సెకన్ల వ్యవధి ఉంటుంది. ఈ లోపు నగదు తీసుకోకపోతే అది ఏటీఎంలోకి వెళ్లిపోతుంది. దొంగలు 20 సెకన్ల వరకూ నగదు తీసుకోకుండా చేతిలోనే పట్టుకుంటారు. యంత్రం ఆ డబ్బును ఉపసంహరించుకునే సమయం అయిపోయాక తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల నగదు తీసినట్టు యంత్రం నమోదు చేయలేదనీ, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని