సిమెంట్‌ పరిశ్రమకు మంచి భవిష్యత్తు: కుమార మంగళం బిర్లా

భారత సిమెంట్‌ పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ఆర్థిక

Published : 27 Jul 2021 21:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సిమెంట్‌ పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి భవిష్యత్తు ఉంటుందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా అన్నారు. ‘‘హౌసింగ్‌, ఇతర నిర్మాణ రంగంలోని ప్రాజెక్టులకు, సిమెంట్‌ పరిశ్రమ వృద్ధికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే కేంద్ర ప్రభుత్వ పథకం వల్ల, అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల ఈ రంగం చాలా బాగా వృద్ధి చెందుతుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో మరింత జోరు అందుకుంటుంది ’’ అని ఆయన తమ కంపెనీ షేర్‌ హోల్డర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్మాణరంగంలోని ప్రాజెక్టులపై భారీగా ఖర్చు పెడుతున్నాయని, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఎవై) కింద ఇళ్ల నిర్మాణాలు జరగనుండటంతో ఈ రంగానికి ఊపు వస్తోందని ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌’  వార్షిక నివేదిక వెల్లడించింది. మౌలిక వసతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం వల్ల సిమెంట్‌ పరిశ్రమ వృద్ధికి అది దోహదం చేస్తుందని ఆ తాజా నివేదిక తెలిపింది.

మందగమనం తాత్కాలికమే.. ఊపందుకునే సంకేతాలే జోరు! 

2021లో ఇంతవరకూ కొవిడ్‌ మహమ్మారి ప్రభావం కారణంగా ఈ రంగంలో 10-12 శాతం వృద్ధి మందగించిందని, అయితే ముందు రాబోయే నెలల్లో తొందరగా కోలుకుంటుందని, ఇప్పటికే అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయని కుమార మంగళం బిర్లా అన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు నిర్మాణరంగం కార్యకలాపాలు, ఉత్పత్తిరంగంలోని పరిశ్రమలు పూర్తిగా ఆగిపోవడం, కార్మికులు మూకుమ్మడిగా వలసపోవడంతో మొదటి మూడు నెలల్లో డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. దాంతో గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలలు ఉత్పాదక రంగంలోని అన్ని సంస్థలు పెద్ద సవాలు ఎదుర్కొన్నాయని ఆయన అన్నారు. అయితే మే 2020 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలించడంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఆ తర్వాత ఊహించినంత కాకపోయినా చాలావరకు  గ్రామీణ మార్కెట్‌లో సిమెంట్‌కు బాగా డిమాండ్‌ పెరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలోనూ కార్మికులు లభిస్తుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. తక్కువ బడ్జెట్‌ ఇళ్ల నిర్మాణం పెరిగింది. దాంతో సిమెంట్‌కు భారీ ఎత్తున డిమాండ్‌ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.  రహదారుల నిర్మాణం, మెట్రో ప్రాజెక్టుల వల్ల కూడా డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. తమ సంస్థ  సిమెంట్‌ ఉత్పత్తిని ఏడాదికి 12.8 మిలియన్‌ టన్నులు పెంచేందుకుగాను కొత్తగా రూ.5,477 కోట్ల  వ్యయం చేయనుందని ఆయన తెలిపారు. 

సిమెంట్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానం
సిమెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌(సీఎంఏ) ప్రకారం భారత సిమెంట్‌ పరిశ్రమ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇక్కడ దేశీయ మార్కెట్‌లో సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 55 కోట్ల టన్నులు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఉత్పత్తిలో ఏడుశాతంగా ఉంది. కాగా.. అల్ట్రాటెక్‌ ఏడాదికి 11.6 కోట్ల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తూ, ఆ రంగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని