India@75: మరో 25ఏళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

వచ్చే 25ఏళ్లలో మరిన్ని లక్ష్యాలను సాధించి.. శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 15 Aug 2022 19:38 IST

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ:  స్వాతంత్ర్య వేడుకలు (Independence Day) జరుపుకొంటోన్న భారత్‌.. రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధించే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ముఖ్యంగా వచ్చే 25ఏళ్లలో మరిన్ని లక్ష్యాలను సాధించి.. శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) అభివృద్ధి చెందిన దేశంగా (Developed Country) భారత్‌ అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం (Azadi Ka Amrit Mahotsav) సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. దాదాపు 83 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకోవడంతో పాటు భారత లక్ష్యాలు, నారీశక్తి, అవినీతి, కుటుంబ రాజకీయాల వంటి అంశాలను ప్రస్తావించారు.

రానున్న రోజుల్లో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలపై మాట్లాడిన మోదీ.. ప్రతి ఒక్కరికి ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపుతోపాటు ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు సాకారం చేసేందుకు ఐదు అంశాలపై ప్రధానంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం, బానిసత్వ నిర్మూలన, వారసత్వాన్ని పరిరక్షించడం, ఐకమత్యం, పౌరులు బాధ్యతలను నిర్వర్తించడం.. వంటివి ఐదు ప్రధాన లక్ష్యాలుగా (పంచ ప్రాణాలు) ప్రధాని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే 25ఏళ్లు మరింత చిత్తశుద్ధితో, లక్ష్యాలను చేరుకునేందుకు ముందుకు సాగాలని భారత ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కర్తగా ఇప్పటికే యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న భారత్‌.. 130 కోట్ల మంది సంకల్పంతో 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

5జీ సేవలపై ప్రకటన..

ప్రస్తుతం ఉన్న 4జీ కన్నా అధిక వేగంతో డేటా అందించే 5జీ సేవల గురించి ప్రధాని మోదీ ప్రకటన చేశారు. త్వరలోనే దేశంలో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. దీని కోసం ఎంతోకాలం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ తీసుకెళ్తున్నామని చెప్పారు. గ్రామాల్లో 4 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయనీ.. దీనివల్ల 4 లక్షల డిజిటల్‌ ఆంత్రప్రెన్యూర్‌లో సిద్ధమవుతున్నారన్నారు.

అమృత కాలంలో పరిశోధనలకు పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. దేశ యువతపై తనకా నమ్మకం ఉందని పేర్కొన్నారు. 5జీ, సెమీకండక్టర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ ఏర్పాటు వంటివి ఆధునీకరణకు సంకేతం మాత్రమే కాదు.. అందులో మూడు పెద్ద శక్తులు ఇమిడి ఉన్నాయని మోదీ వివరించారు. డిజిటల్‌ యుగంలో విద్య, వైద్యం అన్నీ డిజిటల్‌ రూపు సంతరించుకోనున్నాయని చెప్పారు. సాంకేతికతతో ముడిపడి ఉన్న ఈ దశాబ్దాన్ని టెకేడ్‌గా మోదీ పేర్కొన్నారు.

ఇథనాల్ లక్ష్యం చేరుకున్నాం..

పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని అనుకున్నదానికంటే ముందుగానే భారత్‌ చేరుకుందని ప్రధాని మోదీ అన్నారు. 2022 నవంబర్‌ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండగా.. జూన్‌ నాటికే దాన్ని సాధించామన్నారు. 2025 నాటికి 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు