Stock Market: భారీ ఊగిసలాటలో మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం భారీ నష్టాల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది....

Updated : 25 Jan 2022 12:13 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ ఊగిసలాట ధోరణిలో ట్రేడవుతున్నాయి. ఉదయం భారీ నష్టాల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు జరగడంతో అనూహ్యంగా పుంజుకొని స్వల్ప లాభాల్లోకీ ఎగబాకింది. కానీ, అది ఎంతోసేపు నిలవలేదు. వెంటనే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో తిరిగి 500 పాయింట్లు నష్టపోయింది. ఇలా ప్రారంభం నుంచి సూచీలు భారీ ఊగిసలాట మధ్య పయనిస్తున్నాయి. 

  1. మార్కెట్ల ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 22.62 శాతానికి చేరింది. సాధారణంగా వీఐఎక్స్‌ పెరుగుదల మదుపర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంది. రాబోయే 30 రోజుల్లో మార్కెట్‌ కదలికలపై ఓ అంచనా అందిస్తుంది. వీఐఎక్స్‌ 15 శాతానికి పైగా ఉంటే రాబోయే కొన్ని రోజులు మార్కెట్లో భారీ ఊగిసలాట కొనసాగే అవకాశం ఉందని అర్థం. మార్కెట్‌ కదలికలపై మదుపర్ల భయాల్ని ఇది తెలియజేస్తుంటుంది. 
  2. ఉదయం 12:09 గంటల సమయంలో సెన్సెక్స్‌ 279 పాయింట్లు నష్టపోయి 57,212 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు కుంగి 17,088 వద్ద ట్రేడవుతోంది. 
  3. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాలు చవిచూస్తున్నాయి.
  4. రిలయన్స్‌ షేర్లు ఈరోజు ఓ దశలో 3 శాతం వరకు పడ్డాయి. దీంతో గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు 7 శాతానికి పైగా పడినట్లైంది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.17 లక్షల కోట్లు తగ్గింది.
  5. యాక్సిస్‌ బ్యాంకు షేర్లు ఈరోజు 5 శాతానికి పైగా లాభంతో చలిస్తున్నాయి. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించడమే అందుకు కారణం. బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం సుమారు 3 రెట్లు పెరిగి రూ.3,973 కోట్లకు చేరింది. రుణాల మంజూరులో బలమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం, కేటాయింపులు గణనీయంగా తగ్గడం ఇందుకు దోహదం చేసింది. స్టాండలోన్‌ పద్ధతలోనూ నికర లాభం రూ.1,116 కోట్ల నుంచి పెరిగి రూ.3,614.24 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా రూ.18,355 కోట్ల నుంచి రూ.21,101 కోట్లకు పెరిగింది.
  6. జీవనకాల గరిష్ఠం నుంచి ఇటీవల దాదాపు 20 శాతానికి పైగా పడిన జొమాటో షేర్లు నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో 7 శాతం వరకు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్న కారణంగానే కంపెనీ షేర్లు పతనమవుతున్నాయని.. మరే కారణం లేదని సంస్థ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 
  7. రంగాలవారీగా చూస్తే.. టెలికాం, విద్యుత్తు, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, యుటిలిటీస్‌ రంగాలు రాణిస్తున్నాయి. ఇంధనం, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ, స్థిరాస్తి రంగ సూచీలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. 
  8. నిఫ్టీ50 సూచీలో 27 షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 23 నష్టాలు చవిచూస్తున్నాయి. 
  9. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలకు రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ఆజ్యం పోయడం మదుపర్లను కలవరపరుస్తోంది.
  10. బిట్‌కాయిన్‌ విలువ మంగళవారం మధ్యాహ్నం 12.09 గంటల సమయానికి 2.18 శాతం పెరిగి, 36,060.26 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నెల రోజుల వ్యవధిలో బిట్‌కాయిన్‌ విలువ దాదాపు 15,870 డాలర్లు  (31.2 శాతం) పతనం కావడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని