Stock Market: వరుసగా రెండోరోజూ భారీ నష్టాలు.. 18,000 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి...

Updated : 19 Jan 2022 16:00 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. దిగ్గజ షేర్ల కుంగుబాటుతో పాటు ఆర్థిక, ఐటీ రంగాల్లో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 60,845.59 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో 59,949.22 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 656.04 పాయింట్లు కోల్పోయి 60,098.82 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 59,949.22 - 60,870.17 మధ్య కదలాడింది. నిఫ్టీ 18,129.20 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. రోజులో 18,129.20 - 17,884.90 మధ్య కదలాడింది. చివరకు 174.65 పాయింట్ల నష్టంతో 17,938.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.44 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌30 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు


అంతర్జాతీయ ప్రతికూలతలు...

బీఎస్‌ఈ 30 సూచీ పతనంలో దిగ్గజాలైన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌లదే కీలక పాత్ర. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ సైతం సూచీలను కిందకు లాగాయి. ఇటీవల లిస్టయిన పేటీఎం 5 శాతానికిపైగా కుంగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలే ఇందుకు కారణం. ఆసియా మార్కెట్లు ఈరోజు డీలా పడగా.. ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. మరోవైపు చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకున్నాయి. మరోవైపు గతకొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత మదుపర్లతో పాటు, దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలకు దిగడం సూచీలపై ప్రభావం చూపింది. అలాగే అమెరికాలో 5జీ సేవల ప్రారంభంపై విమానయాన సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పటికే అనేక దేశాలు విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు కొనసాగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రతికూల పరిణామాలే నేడు దేశీయ సూచీల పతనానికి కారణమయ్యాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు...

* పేటీఎం మాతృసంస్థ వన్‌97కమ్యూనికేషన్స్‌ షేర్లు ఈరోజు 5 శాతం మేర కుంగి కనిష్ఠానికి చేరాయి. ఇష్యూ ధర రూ.2,150తో పోలిస్తే కంపెనీ షేర్లు  ఇప్పటి వరకు 54 శాతం మేర పడిపోయాయి. గత మూడు సెషన్లలో షేరు విలువ 10 శాతం కుంగడం గమనార్హం. 

* మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 7 శాతం మేర కుంగాయి. కంపెనీ రూ.137 కోట్ల నష్టాలను నివేదించింది.  

* అవినీతి ఆరోపణల కింద సీబీఐ అరెస్ట్‌ చేసిన గెయిల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఈ.ఎస్‌.రంగనాథన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు గెయిల్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 3 శాతం మేర ఎగబాకాయి. 

* జేఎస్‌డబ్ల్యూ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం రూ.324 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఈ లాభాలు రూ.124 కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఆదాయం రూ.1,659 కోట్ల నుంచి 1,984 కోట్లకు పెరిగింది.     

* డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఓరియెంట్‌ గ్రీన్‌ పవర్‌ కంపెనీ రూ.6.28 కోట్ల నికర లాభాల్ని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు