మ్యూచువల్‌ ఫండ్లు.. పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా?

ఒకప్పుడు మ్యూచువల్‌ ఫండ్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం పెద్ద ప్రక్రియ. ఫండ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి లేదా ఏజెంటు ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపి, సమర్పించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క క్లిక్‌తోనే

Updated : 21 Jan 2022 12:15 IST

ఒకప్పుడు మ్యూచువల్‌ ఫండ్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం పెద్ద ప్రక్రియ. ఫండ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి లేదా ఏజెంటు ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపి, సమర్పించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క క్లిక్‌తోనే పెట్టుబడులను వెనక్కి తీసుకునే సదుపాయం వచ్చింది. కొన్నిసార్లు ఇది మనకు సౌకర్యంగానే ఉన్నా.. చాలా సందర్భాల్లో అవసరం లేకపోయినా పెట్టుబడుల ఉపసంహరణకు కారణమవుతోంది.

* లక్ష్యాలకు చేరువగా: ప్రతి పెట్టుబడికీ ఒక గమ్యం ఉండాలి. మీరు ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించినప్పుడే దీన్ని నిర్ణయించుకోవాలి. దానిని చేరుకునేంత వరకూ పెట్టుబడుల్లో ఒక్క రూపాయినీ వెనక్కి తీసుకోవద్దు. కొన్నిసార్లు మీరు అనుకున్న వ్యవధిలోపే అవసరానికి కావాల్సినంత మొత్తం జమ కావచ్చు. ఇలాంటప్పుడు మీరు పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు.. గమ్యం మరో రెండుమూడేళ్లు ఉందనగా.. ఈక్విటీలాంటి నష్టభయం ఉన్న పథకాల నుంచి డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులను మళ్లించాలి. దీనివల్ల నష్టభయం పరిమితం అవుతుంది. దీనికోసం క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) వినియోగించుకోవాలి. సిప్‌లాగే ఇదీ మీ పెట్టుబడులను క్రమంగా ఈక్విటీల నుంచి డెట్‌కు మళ్లించేందుకు ఉపయోగపడుతుంది.

* నిర్ణయాలు మారినప్పుడు..: కాలానుగుణంగా కొన్నిసార్లు లక్ష్యాలు, అవసరాలు మారుతుంటాయి. స్వల్పకాలిక అవసరం అనుకొన్నది.. దీర్ఘకాలానికి మారొచ్చు. ఇలాంటప్పుడు దానికి ముడిపెట్టిన పెట్టుబడినీ అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. అంతేకానీ, అవసరం మారింది కదా అని పెట్టుబడిని వెనక్కి తీసుకోవద్దు. ఈ లక్ష్యాల ప్రకారం మీ పెట్టుబడుల కేటాయింపులూ మారాలి.

* పనితీరు బాగాలేకపోతే..: ఫండ్లలో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడు మంచి రాబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్పే మాట. దీర్ఘకాలం కొనసాగడం ఇక్కడ లక్ష్యం కావాలి కానీ.. పనితీరు ఏమాత్రం బాగాలేని ఫండ్లలో కొనసాగాలని కాదు. కనీసం ఏడాదికోసారైనా మీ ఫండ్ల పనితీరును సమీక్షించుకుంటూ ఉండాలి. అదే విభాగంలోని మిగతా ఫండ్లతో పోల్చి చూసుకోవాలి. రాబడి ఆశించిన మేరకు రాకపోతే వెంటనే వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని