టీసీఎస్‌ బ్రాండ్‌ బాజా

అంతర్జాతీయంగా ఐటీ సేవల సంస్థల్లో రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇన్ఫోసిస్‌తో పాటు మరో 4 భారతీయ

Published : 27 Jan 2022 03:46 IST

అంతర్జాతీయంగా రెండో అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థ

టాప్‌-25లో మరో 5 భారతీయ కంపెనీలు

బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక

దిల్లీ: అంతర్జాతీయంగా ఐటీ సేవల సంస్థల్లో రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇన్ఫోసిస్‌తో పాటు మరో 4 భారతీయ కంపెనీలు అగ్రశ్రేణి 25 ఐటీ సేవల సంస్థల జాబితాలో చోటు సంపాదించాయని పేర్కొంది. ఇన్ఫోసిస్‌కు మూడో ర్యాంకు లభించగా, విప్రోకు 7, హెచ్‌సీఎల్‌ టెక్‌కు 8, టెక్‌ మహీంద్రాకు 15, ఎల్‌టీఐకు 22వ ర్యాంకు లభించింది. ఈ 6 భారతీయ బ్రాండ్‌లు 2020-22లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-10 ఐటీ సేవల బ్రాండ్‌లలో ఉన్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.

* ప్రపంచంలోనే అత్యంత విలువైన, బలమైన ఐటీ సేవల బ్రాండ్‌గా అసెంచర్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. దీని బ్రాండ్‌ విలువ 3,620 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.71 లక్షల కోట్లు)గా ఉంది.
* భారతీయ ఐటీ సేవల బ్రాండ్‌లు 2020-22లో సగటున 51 శాతం వృద్ధిని సాధించగా, అమెరికా బ్రాండ్లలో 7 శాతం క్షీణత నమోదయ్యింది.

ఇవీ భారత్‌ ప్రత్యేకతలు

* ఎక్కడి నుంచైనా పనిచేసే విధానానికి ఐటీ సేవల రంగం మారడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ డిజిటలీకరణ వేగంగా పెరిగినందున భారత్‌లో ఐటీ సేవాసంస్థలు వేగంగా విస్తరించాయి.
* బలమైన ఐటీ సేవల బ్రాండ్‌లు, డిజిటల్‌ నైపుణ్యాలు కలిగిన వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
* టీసీఎస్‌ వార్షిక ప్రాతిపదికన 12 శాతం, 2020 నుంచి 24 శాతం మేర వృద్ధి సాధించి 1,680 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.26 లక్షల కోట్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానానికి చేరింది.
* ఇన్ఫోసిస్‌ గత ఏడాది 52 శాతం, 2020 నుంచి 80 శాతం వృద్ధితో 1,280 కోట్ల డాలర్ల (సుమారు రూ.96,000 కోట్లు) బ్రాండ్‌ విలువ సాధించి మూడో స్థానంలో ఉంది.
* ఐబీఎం బ్రాండ్‌ విలువ గతేడాది కంటే 34 శాతం తగ్గి 1060 కోట్ల డాలర్ల (సుమారు రూ.79,500 కోట్ల)తో ఈ జాబితాలో 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
* విప్రో బ్రాండ్‌ విలువ 630 కోట్ల డాలర్లు (సుమారు రూ.47,250 కోట్లు), హెచ్‌సీఎల్‌ టెక్‌ బ్రాండ్‌ విలువ 610 కోట్ల డాలర్లు (సుమారు రూ.45,750 కోట్లు), టెక్‌ మహీంద్రా బ్రాండ్‌ విలువ 300 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.22,500 కోట్లు) ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని