చమురు మంటలు

ముడిచమురు ధర మరింతగా మండిపోతోంది. బుధవారం అంతర్జాతీయ విపణిలో బ్యారల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర 90 డాలర్లను అధిగమించింది. 2014 అక్టోబరు తరవాత ఇదే గరిష్ఠస్థాయి.

Published : 27 Jan 2022 03:46 IST

ఏడేళ్ల తరవాత బ్యారల్‌ ధర 90 డాలర్లకు

ఉత్పత్తి పెంపుపై 2న నిర్ణయించనున్న ఒపెక్‌

ముడిచమురు ధర మరింతగా మండిపోతోంది. బుధవారం అంతర్జాతీయ విపణిలో బ్యారల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర 90 డాలర్లను అధిగమించింది. 2014 అక్టోబరు తరవాత ఇదే గరిష్ఠస్థాయి. గిరాకీ కంటే చమురు సరఫరా తక్కువగా ఉండటం, ఐరోపా-మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు ఇందుకు కారణమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై కనుక దాడి చేస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై వ్యక్తిగత ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మంగళవారం హెచ్చరించగా, అంతకుముందు రోజు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కార్యాలయంపై యెమెన్‌ హౌతీ సంస్థ మిస్సైల్‌ దాడి జరపడం ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇందువల్ల చమురు సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడతాయనే భయాలు ఏర్పడి, ధర పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, చమురు ధర తగ్గేందుకు అవకాశాలు స్వల్పమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సరఫరాలు పెరిగేనా?
కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో, లాక్‌డౌన్‌ల వల్ల గిరాకీ క్షీణించినందున చమురును అధికంగా ఎగుమతి చేసే ఒపెక్‌+ అనుబంధ దేశాలు ఉత్పత్తిని బాగా తగ్గించాయి. కొవిడ్‌ ఆంక్షలు తొలగడం ప్రారంభమయ్యాక, ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్నాయి. ఒమిక్రాన్‌ కేసుల విస్తృతి అధికంగా ఉన్నా, ప్రస్తుతం చమురుకు గిరాకీ బాగా పెరిగింది. అయినా కూడా ఒపెక్‌ దేశాలు మాత్రం తమ ఉత్పత్తి ప్రణాళికలో మార్పు చేయలేదు. చమురు ధరలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నందున, ఫిబ్రవరి 2న నిర్వహించనున్న సమావేశంలో ఒపెక్‌ దేశాలు తగిన నిర్ణయం తీసుకుంటాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 2020లో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన దేశాలు, తదుపరి రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేస్తున్నాయి. ఇది మరింత పెరిగితే భారత్‌ సహా చమురు అధికంగా వినియోగించే దేశాలకు ఉపశమనం లభిస్తుంది.

తగ్గిన పసిడి ధర
ఉక్రెయిన్‌ - రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో, 1850 డాలర్లకు చేరిన ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర బుధవారం 1 శాతానికి పైగా తగ్గి, 1830 డాలర్లకు దిగి వచ్చింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంచుతున్నందున, డాలర్‌ బలోపేతం కావడం ఇందుకు కారణం. దేశీయంగా 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.50,200 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

నిన్న మార్కెట్లు పనిచేయలేదు.
గణతంత్ర దినోత్సవం సôదర్భంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. ఫారెక్స్‌, బులియన్‌ మార్కెట్లకు కూడా సెలవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని