బేర్‌ ప్రతాపం

అంతర్జాతీయ ప్రతికూలతలతో బేర్‌ బెంబేలెత్తించింది. చాలా రోజుల తర్వాత మన మదుపర్లకు తన విశ్వరూపాన్ని చూపింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను

Published : 25 Jan 2022 03:01 IST

భారీ నష్టాలతో బెంబేలెత్తిన మార్కెట్లు

1546 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌

రూ.9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

అంతర్జాతీయ ప్రతికూలతలతో బేర్‌ బెంబేలెత్తించింది. చాలా రోజుల తర్వాత మన మదుపర్లకు తన విశ్వరూపాన్ని చూపింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను వణికించాయి. ఫలితంగా వరుసగా అయిదోరోజూ దేశీయ సూచీలు నష్టపోయాయి. రెండు నెలల్లోనే అతిపెద్ద ఒక రోజు నష్టాన్ని సోమవారం చవిచూశాయి. సెన్సెక్స్‌ 58,000 పాయింట్ల దిగువకు పడిపోగా.. నిఫ్టీ ఇంట్రాడేలో 17,000 పాయింట్లను పరీక్షించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు తగ్గి మూడు వారాల కనిష్ఠమైన 74.60 వద్ద ముగిసింది.

ఉదయం నీరసంగానే ప్రారంభమైన సెన్సెక్స్‌కు, గంటగంటకు నష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఇంట్రాడేలో 2050 పాయింట్లు కుదేలైన సెన్సెక్స్‌.. 56,984 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కొంత తేరుకుని 1545.67 పాయింట్ల నష్టంతో 57,491.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 468.05 పాయింట్లు క్షీణించి   17,149.10 దగ్గర స్థిరపడింది. నవంబరు 26 తర్వాత సెన్సెక్స్‌, నిఫ్టీలకు ఇదే అతిపెద్ద ఒక రోజు నష్టం. గత 5 రోజుల్లో సెన్సెక్స్‌ 3300 పాయింట్లు, నిఫ్టీ 1100 పాయింట్లకు పైగా కుదేలయ్యాయి.

సూచీల పతనంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే రూ.9.13 లక్షల కోట్లు తగ్గి రూ.260.52 లక్షల కోట్లకు చేరింది. గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో మొత్తం రూ.19.50 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.

డిసెంబరు త్రైమాసికంలో రూ.7230 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు  7.98 శాతం కోల్పోయి రూ.10.95 దగ్గర స్థిరపడింది.

మెరుగైన ఫలితాలు ప్రకటించినప్పటికీ ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు ఆరంభ లాభాలు పోగొట్టుకుంది. ఇంట్రాడేలో రూ.818.80 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 0.80% నష్టంతో రూ.798.20 దగ్గర ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఒక్క షేరూ లాభపడలేదు. టాటా స్టీల్‌ 5.98%, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.97%, విప్రో 5.35%, టెక్‌ మహీంద్రా 5.14%, టైటన్‌ 4.97%, ఆర్‌ఐఎల్‌ 4.06%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.84%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.83%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.63%, కోటక్‌ బ్యాంక్‌ 3.20%, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.03%, అల్ట్రాటెక్‌  2.81% చొప్పున డీలాపడ్డాయి.

బీఎస్‌ఈలో 875 (22 శాతం) షేర్లు ఇంట్రాడేలో లోయర్‌ సర్క్యూట్‌కు పడిపోయాయి.

బిట్‌కాయిన్‌ విలువ సోమవారం రాత్రి 11.15 గంటల సమయానికి 3.6 శాతం తగ్గి, 34,970 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నెల రోజుల వ్యవధిలో బిట్‌కాయిన్‌ విలువ దాదాపు 15,870 డాలర్లు  (31.2 శాతం) పతనం కావడం గమనార్హం.

పెట్టుబడులు అధికమై, అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర 1835 డాలర్లకు చేరింది. ఇది 2 నెలల గరిష్ఠస్థాయి. ఒకదశలో ఈ ధర 1843 డాలర్లకు చేరింది కూడా.


జొమాటో 20%.. నైకా 13%

టీవల ఐపీఓలకు వచ్చిన కొత్త తరం కంపెనీల షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. జొమాటో షేరు 19.65% నష్టంతో రూ.91.40 వద్ద ముగియగా.. ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ (నైకా) షేరు 12.93% కోల్పోయి రూ.1734.85 దగ్గర స్థిరపడింది. శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌, పాలసీబజార్‌, కెమ్‌ప్లాస్ట్‌, మ్యాప్‌మై ఇండియా, లేటెంట్‌ వ్యూ, గోకలర్స్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ, సీఎంఎస్‌ ఇన్ఫో, రేట్‌గెయిన్‌ 7-12% వరకు నష్టాలు చవిచూశాయి. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన తర్వాత సోమవారం ఈ షేర్లన్నీ జీవనకాల కనిష్ఠాలకు పడిపోయాయి. సఫైర్‌ ఫుడ్స్‌, దేవయానీ వంటి షేర్లు 6 శాతం పడ్డాయి. కార్‌ట్రేడ్‌ 5.56%, పేటీఎం 4.43% చొప్పున కుదేలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని