స్వల్పకాలంలో ఒడుదొడుకులు!

బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ భయాల దృష్ట్యా అమెరికా ఫెడ్‌ సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధం కావడం అమ్మకాలకు దారితీసింది. ఫెడ్‌ పరపతి సమావేశానికి ముందు మదుపర్లు

Published : 24 Jan 2022 02:16 IST

సమీక్ష: బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ భయాల దృష్ట్యా అమెరికా ఫెడ్‌ సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధం కావడం అమ్మకాలకు దారితీసింది. ఫెడ్‌ పరపతి సమావేశానికి ముందు మదుపర్లు అప్రమత్తమయ్యారు. దేశీయంగా చూస్తే.. కీలక పరిణామాలు లేకపోవడంతో కంపెనీల త్రైమాసిక ఫలితాలకు మార్కెట్లు స్పందించాయి. కార్పొరేట్‌ వార్తలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించడం కొనసాగింది. కంపెనీలు మిశ్రమ ఫలితాలు నమోదు చేయడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో సూచీలు డీలాపడ్డాయి. యూఏఈ చమురు కేంద్రాలపై హౌతి గ్రూప్‌ దాడులతో బ్యారెల్‌ ముడిచమురు ఏడేళ్ల గరిష్ఠానికి చేరింది. మరో 2 శాతం పెరిగి 87.9 డాలర్లుగా నమోదైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.15 నుంచి 74.42కు తగ్గింది. అంతర్జాతీయంగా చూస్తే.. ద్రవ్యోల్బణ భయాలతో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బాండ్ల రాబడులు పెరగడం, ముడిచమురు ధరల పరుగులు ఇందుకు తోడయ్యాయి. బ్రిటన్‌ ద్రవ్యోల్బణ రేటు 30 ఏళ్ల గరిష్ఠమైన 5.4 శాతంగా నమోదైంది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 3.5 శాతం నష్టంతో 59,037 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 3.5 శాతం తగ్గి 17,617 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఐటీ, ఆరోగ్య సంరక్షణ, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లు కుదేలయ్యాయి. విద్యుత్‌, వాహన, చమురు- గ్యాస్‌ స్క్రిప్‌లు మాత్రం రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.12,643 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.508 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 6:7గా నమోదు కావడం.. మార్కెట్‌లో అమ్మకాలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: వరుసగా మూడు వారాల పాటు పరుగులు తీసిన మార్కెట్‌, గత వారం భారీ నష్టాలతో ముగిసింది. గరిష్ఠ స్థాయుల్లో నిరోధం ఎదురుకావడంతో కీలకమైన 58,621 పాయింట్ల చేరువైంది. ఈ స్థాయిని కోల్పోతే సెన్సెక్స్‌ 58,000 పాయింట్లు, ఆ తర్వాత 57,400 పాయింట్ల వరకు దిద్దుబాటు కొనసాగవచ్చు. మరోవైపు 59700- 60050 శ్రేణిలో తక్షణ నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. మార్కెట్‌ స్థిరీకరణ, ఒడుదొడుకులు స్వల్పకాలంలో పెరగొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో.. మార్కెట్లు ఈ వారం నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలతో షేరు ఆధారిత కదలికలు కొనసాగనున్నాయి. జనవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. సాధారణ బడ్జెట్‌కు దగ్గరపడటంతో పలు రంగాల షేర్లు వెలుగులోకి రావొచ్చు. ఈ వారం యాక్సిస్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, సిప్లా, మారుతీ, పిడిలైట్‌, కోల్గేట్‌, ఇండస్‌ టవర్స్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, మారికో ఫలితాలు ప్రకటించనున్నాయి. అదానీ విల్మార్‌ రూ.3600 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ 27న ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్‌ సమావేశాలు కీలకం కానున్నాయి. జపాన్‌ పీఎంఐ, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ నిర్ణయాలు, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ముడిచమురు ధరలు మరింత పెరిగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది.

తక్షణ మద్దతు స్థాయులు: 58,620, 58,000, 57,420
తక్షణ నిరోధ స్థాయులు: 59,330, 60,046, 60,870
స్వల్పకాలంలో మార్కెట్‌ ఒడుదొడుకులు పెరగొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు