వ్యయాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలి

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలు కన్పిస్తుండగా.. చాలా వరకు ఇబ్బందికర పరిణామాలు గోచరిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యయాలపై లక్ష్యాన్ని

Published : 24 Jan 2022 02:16 IST

లేదంటే భారీ లోటు ఏర్పడే అవకాశం
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలు కన్పిస్తుండగా.. చాలా వరకు ఇబ్బందికర పరిణామాలు గోచరిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యయాలపై లక్ష్యాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకోకపోతే భారీ లోటు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తారని పేరున్న రాజన్‌ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్‌ షికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఆచార్యులుగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌తో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లిష్‌ అక్షరం ‘కె’ ఆకారంలో రికవరీని నిరోధించడానికి ప్రభుత్వం మరింత చేయాల్సిన అవసరం ఉందని రాజన్‌ వివరించారు. సాధారణంగా కె-ఆకార రికవరీలో సాంకేతిక, అగ్ర శ్రేణి (లార్జ్‌ క్యాపిటల్‌) సంస్థలు వేగంగా రికవరీ సాధిస్తాయని, చిన్న స్థాయి వ్యాపారాలు, పరిశ్రమలు మహమ్మారి ప్రభావంతో దారుణంగా దెబ్బ తిన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. ‘మధ్య తరగతి ప్రజలు, చిన్న, మధ్య స్థాయి రంగాలు, మన చిన్నారుల భవిష్యత్‌.. వీటి గురించే నాకు ఆందోళన అధికంగా ఉంది. వినియోగ వృద్ధి బలహీనంగా ఉంది. ప్రధానంగా ఎక్కువ మంది వాడే వినియోగ వస్తువులకు గిరాకీ అంతగా పెరగలేద’ని రాజన్‌ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

* ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూలతల విషయానికొస్తే.. అగ్రశ్రేణి సంస్థలు దృఢంగా ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు బాగా పని చేస్తున్నాయి. వేర్వేరు రంగాల్లో యూనికార్న్‌లు (100 కోట్ల డాలర్లపైన విలువైన అంకురాలు) పుట్టుకొస్తున్నాయి. ఆర్థిక రంగంలోనూ కొన్నిచోట్ల బలమైన పునాదులున్నాయి.

* ఇబ్బందికర పరిణామాల్లో నిరుద్యోగిత పెరగడం, కొనుగోలు సామర్థ్యం తగ్గడం లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం మరీ దారుణంగా ఉంది. చిన్న, మధ్య స్థాయి సంస్థలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. రుణ వృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

* కొవిడ్‌-19 కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్‌.. ఆరోగ్యపరంగా, ఆర్థిక కార్యకలాపాలపరంగా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పురోగతి ‘కె’ ఆకారంలోకి మారే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి.

* ప్రస్తుతం ఏయే రంగాలకు అవసరమో వాటిపైనే ఖర్చు చేయాలి. ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను గట్టెక్కించడంపై దృష్టి పెట్టాలి. వ్యయ లక్ష్యాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే.. భారీ లోటుకు ఆస్కారమనేదే ఉండదు.

* ద్రవ్యోల్బణం ఆందోళన ప్రతి దేశాన్ని వేధిస్తోంది.. భారత్‌ విషయానికొస్తే ద్రవ్యోల్బణం విషయంలో ఒక అంచనాకు రావడం కష్టంగా ఉంది.

* రాబోయే బడ్జెట్లో టారీఫ్‌ కోతలు ఎక్కువగా.. పెంపులు తక్కువగా ఉండటాన్ని నేను చూడాలనుకుంటున్నాను.

* ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 9 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.

* వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న సమయంలో రాజన్‌ కె-ఆకార రికవరీపై మాట్లాడటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యయాలపై లక్ష్యాన్ని ఎలా నిర్దేశిస్తుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని