వ్యయాలు పెరిగాయి.. ఆదాయాలు తగ్గుతాయా?

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయ ఔషధ కంపెనీల ఆదాయాలు, లాభాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవలి పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, ఔషధ కంపెనీలు

Published : 20 Jan 2022 01:41 IST

ఔషధ కంపెనీలకు ఇంటా, బయటా సవాళ్లు

మూడో త్రైమాసిక సమీక్ష

ఈనాడు - హైదరాబాద్‌

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయ ఔషధ కంపెనీల ఆదాయాలు, లాభాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవలి పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, ఔషధ కంపెనీలు ఆకర్షణీయ వృద్ధి నమోదు చేసే అవకాశాలు లేవనే అభిప్రాయం కలగక మానదు. ముడిపదార్థాల వ్యయాలు పెరగడం, సరకు రవాణా ఛార్జీలు అధికం కావడం, అదే సమయంలో అమెరికాలో పెరిగిన పోటీ.. దీనికి ప్రధాన కారణాలు. డిసెంబరు త్రైమాసికంలో కొవిడ్‌ మందుల అమ్మకాలు తగ్గితే, ఇతర విభాగాల మందుల అమ్మకాలు పెరిగాయి. అయితే ‘ఒమిక్రాన్‌’ రకం కరోనా వైరస్‌ కేసులు మనదేశంలో డిసెంబరు చివరి నుంచి అధికంగా పెరుగుతూ, ప్రస్తుతం రోజువారీ లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనివల్ల పారాసెట్మాల్‌, యాంటీ-బయాటిక్‌, విటమిన్లు, యాంటీ-వైరల్‌ ఔషధాల దేశీయ అమ్మకాలు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, అలర్జీ మందుల అమ్మకాలూ అధికమవుతున్నాయి. ఈ ప్రభావం ఫార్మా కంపెనీల మార్చి త్రైమాసిక గణాంకాల్లో కనపడుతుంది. గత అక్టోబరు- డిసెంబరులో ఇలాంటి సానుకూలతలేమీ దేశీయ ఫార్మా కంపెనీలకు లేనందున, మూడో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండే అవకాశం లేదని అంటున్నారు.

ఛార్జీలు, ధరలు అధికం

సరకు రవాణా ఛార్జీలతో పాటు బల్క్‌ ఔషధాలు, సాల్వెంట్లు, ఇంటర్మీడియేట్స్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయి. చైనా నుంచి తగినంతగా దిగుమతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే దేశీయ ఫార్మా కంపెనీలకు అమెరికా, అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌ అనేది తెలిసిందే. ఇటీవల కాలంలో అమెరికాలో కొత్త ఔషధాలకు సత్వరం అనుమతులు రాలేదు. అక్కడి జనరిక్‌ ఔషధాల విభాగంలో పోటీ పెరిగినందున మన ఫార్మా కంపెనీలు ఆకర్షణీయ ధరలకు మందులు విక్రయించలేకపోతున్నాయి. దీనివల్ల అక్కడ లాభాలు తగ్గుతున్నాయి. అయితే అమెరికాలో శ్వాసకోశ వ్యాధుల విభాగం, డయాబెెటిక్‌, డెర్మటాలజీ విభాగాల్లో దేశీయ ఫార్మా కంపెనీల మార్కెట్‌ వాటా పెరిగింది. అందువల్ల ఫార్మా కంపెనీల ఆదాయాలు, లాభాలు మరీ నిరుత్సాహకరంగా ఉండవని చెబుతున్నారు. సన్‌ ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీస్‌, బయోకాన్‌ కంపెనీలు బయోసిమిలర్‌ మందులు విడుదల చేసినందున అవెరికాలో అమ్మకాలు కొంత పెరిగే అవకాశం ఏర్పడింది. శ్వాసకోశ వ్యాధుల విభాగంలో లుపిన్‌ తన అమ్మకాలు పెంచుకోగలిగింది. మిగిలిన కంపెనీల స్థితి ఇలా లేదు. ఈ పరిస్థితుల్లో ‘నిఫ్టీ 200’ సూచీలోని 20 ఫార్మా కంపెనీల నికరలాభం 6 శాతం తగ్గవచ్చని ఫిలిప్‌ కేపిటల్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల సంస్థ తాజా నివేదికలో విశ్లేషించింది.

ప్రస్తుత త్రైమాసికంలో

‘ఒమిక్రాన్‌’ రకం కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రస్తుత త్రైమాసికంలో, ఆ తర్వాత ఫార్మా కంపెనీల ఆదాయాలు, లాభాలు పెరుగుతాయా.. అనేది మరో ప్రశ్న. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంలో ఫార్మా కంపెనీలు దీనిపై వెల్లడించే సమాచారం కీలకంగా మారనుంది. రెమ్‌డెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌, ఫావిపిరవిర్‌, మోల్నుపిరవిర్‌... తదితర కొవిడ్‌ ఔషధాలను దేశీయ కంపెనీలకు అందిస్తున్నాయి. ఈ మందులకు దేశీయ మార్కెట్‌తో పాటు, ఇతర దేశాల్లో గిరాకీ పెరిగిందా... లేదా, అనేది తేలాలంటే జనవరి- మార్చి త్రైమాసికం పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని