మూడు వారాల్లో కొవిడ్‌ ఉగ్రరూపం

దేశీయంగా ‘కొవిడ్‌’ మూడోదశ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ తాజాగా అంచనా వేసింది. నెల రోజుల నుంచి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతున్న సంగతి విదితమే.

Published : 19 Jan 2022 03:50 IST

ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయంగా ‘కొవిడ్‌’ మూడోదశ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ తాజాగా అంచనా వేసింది. నెల రోజుల నుంచి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతున్న సంగతి విదితమే. నగరాలతో మొదలై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను సైతం ఈ వ్యాధి చుట్టేస్తోంది. ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్‌బీఐ తాజా అంచనా. ‘ముంబయిలో ఈ నెల 7న 20,971 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే గరిష్ఠ స్థాయి. ముంబయిలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉంది’ అని ఈ నివేదిక పేర్కొంది.

ఈ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు

కొవిడ్‌’ కేసులు అమెరికాలో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

యూఏఈ, చిలీ, సింగపూర్‌, చైనా తదితర దేశాలు 80 శాతానికి పైగా జనాభాకు టీకాలు వేశాయి. అందువల్ల కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉంది.

దక్షిణాఫ్రికా, యూఎస్‌ఏ, బ్రెజిల్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ మూడో విడత గరిష్ఠ స్థాయి నమోదైంది. అక్కడి నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ దేశాల్లో గరిష్ఠ స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం  పట్టింది.

మనదేశంలో కేసుల సంఖ్య పెరగటం డిసెంబరు 29 నుంచి మొదలైంది. ఈ నెల 17న 2.38 లక్షల కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య  16.56 లక్షలకు పెరిగింది. దేశంలో 64 శాతం జనాభాకు ఇప్పటికే 2 డోసుల టీకా వేయడం పూర్తయ్యింది. టీకాలు తీసుకున్న ప్రజల్లో గ్రామీణ ప్రజలు 83 శాతం ఉన్నారు. అందువల్ల చాలావరకూ ప్రజలకు టీకాతో భద్రత కలిగినట్లు అవుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కానీ కొవిడ్‌ రెండో దశతో పోల్చితే, ఇప్పుడు ఆసుపత్రుల మీద ఒత్తిడి లేదు.

ముంబయిలో కొవిడ్‌ కేసులు 30-39 ఏళ్ల వయస్సు వారిలో అధికంగా బయటపడుతున్నాయి. కానీ ఈ వ్యాధితో మరణిస్తున్న వారి వయస్సు 60- 69 ఏళ్ల మధ్య ఉంటోంది.

‘బిజినెస్‌ యాక్టివిటీ’ సూచీ పతనం

‘ఎస్‌బీఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌’ ఈనెల 10న 109.0 పాయింట్లు ఉండగా, ఈ నెల 17 నాటికి ఇది 101.0 పాయింట్లకు క్షీణించింది. గత ఏడాది నవంబరు 15 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. కూరగాయల లభ్యత, ఆర్టీఓ రిజిస్ట్రేషన్లు, యాపిల్‌ మొబిలిటీ ఇండెక్స్‌ బాగా క్షీణించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని