సుంకాలు తగ్గితే పసిడి మెరుపులే

బంగారంతో పాటు విలువైన లోహాలు, ముత్యాలతో రూపొందించే ఆభరణాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 1.25 శాతానికి పరిమితం చేసి, పరిశ్రమ ఉన్నతికి సహకరించాలని అఖిలభారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) మంగళవారం

Updated : 24 Jan 2022 15:06 IST

జీజేసీ, జీజేఈపీసీ బడ్జెట్‌ విజ్ఞాపనలు
బడ్జెట్‌-2022

బంగారంతో పాటు విలువైన లోహాలు, ముత్యాలతో రూపొందించే ఆభరణాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 1.25 శాతానికి పరిమితం చేసి, పరిశ్రమ ఉన్నతికి సహకరించాలని అఖిలభారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం వీటిపై 3% జీఎస్‌టీ ఉంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) లేకున్నా, నగదుతో ఆభరణాలు కొనుగోలు చేసే పరిమితిని రూ.2 లక్షల నుంచి  రూ.5 లక్షలకు పెంచాలని కోరింది. గ్రామీణుల్లో అధికులకు పాన్‌కార్డు లేదని గుర్తు చేసింది.

22 క్యారెట్ల (916 స్వచ్ఛత) ఆభరణాలను సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకునే వీలు కల్పించాలని కోరింది. కొవిడ్‌ పరిణామాల వల్ల తమ రంగం తీవ్రంగా ప్రభావితం అయినందున, ఈఅవకాశం కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయని జీజేసీ ఛైర్మన్‌ ఆశిష్‌పేథ్‌ పేర్కొన్నారు.

క్రెడిట్‌కార్డుపై ఆభరణాలు కొంటే బ్యాంక్‌ కమీషన్‌గా వసూలు చేస్తున్న 1-1.5 శాతాన్ని పరిహరిస్తే, డిజిటల్‌ చెల్లింపులు అధికమవుతాయని పేర్కొంది. పాత ఆభరణాల విక్రయంపై వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల కొనుగోలుకు వినియోగిస్తే, మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది.

చట్టపరమైన అధికార వ్యవస్థల నుంచి విచారణలు ఎదుర్కోకుండా, పసిడి నగదీకరణ పథకం కింద కనీసం 500 గ్రాముల బంగారం డిపాజిట్‌ చేసేందుకు అనుమతించాలని సూచించింది. వారసత్వ బంగారం మన కుటుంబాల వద్ద అధికంగా ఉంటుంది కనుక, ఈ చర్య తీసుకోవాలంది.

దిగుమతి సుంకాన్ని 4 శాతం చేయండి: బంగారం దిగుమతిపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వజ్రాలు, ఇతర విలువైన రంగురాళ్లపైనా కస్టమ్స్‌ సుంకాన్ని   7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తే, దొంగచాటు రవాణాను నియంత్రించవచ్చని జీజేఈపీసీ ఛైర్మన్‌ కొలిన్‌ షా వివరించారు. ప్రస్తుతం దేశం నుంచి 41  బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.07 లక్షల కోట్ల) ఎగుమతులు జరుగుతున్నాయని, 2047 కల్లా దీన్ని 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.50 లక్షల కోట్ల)కు చేర్చాలనేది లక్ష్యంగా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని