TCS: వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే!

వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తెలియజేసినట్లు సమాచారం. ఆ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్‌ను పంపిందని సంబంధిత వర్గాల ద్వారా

Updated : 25 Sep 2022 08:01 IST

ఉద్యోగులకు టీసీఎస్‌ వెల్లడి

ముంబయి: వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తెలియజేసినట్లు సమాచారం. ఆ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్‌ను పంపిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఇది అమలవుతుందో మెయిల్‌లో తెలపనప్పటికీ.. మరింత సమాచారం కోసం హెచ్‌ఆర్‌ మేనేజర్లను సంప్రదించాల్సిందిగా ఉద్యోగులకు సూచించిందని ఆ వర్గాలు చెప్పాయి.
‘కొవిడ్‌-19 పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయి. అందుకే కార్యాలయాల నుంచి పనిచేయడాన్ని మనం ప్రారంభించాం. మన ఉన్నతోద్యోగులు ఇప్పటికే కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. ఇక మన బృందాలు కూడా కార్యాలయాలకు రావాల్సిన సమయం వచ్చేసింది. రిటర్న్‌ టు ఆఫీస్‌లో భాగంగా.. కనీసం వారంలో 3 రోజులు మీరు ఆఫీసుకి రావాలి. ఇది తప్పనిసరి. మేము మీ హాజరునూ గమనిస్తుంటాం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలనే సమాచారాన్ని మీకు సంబంధించిన మేనేజర్లు తెలియజేస్తారు. ఏమైనా సహకారం కావాలంటే మీ హెచ్‌ఆర్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌ను సంప్రదించండి’ అని ఉద్యోగులకు టీసీఎస్‌ పంపిన మెయిల్‌లో ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఇంతకుమునుపు సామాజిక మాధ్యమాలను కూడా టీసీఎస్‌ ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2025 కల్లా కొత్త పని విధానాన్ని కూడా టీసీఎస్‌ అమలు చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. టీసీఎస్‌ 25*25గా వ్యవహరించే ఈ విధానం ప్రకారం.. ఏ సమయంలోనైనా కేవలం 25 శాతం మంది మాత్రమే ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తారు. దీని వల్ల పని విధానంలో సమతౌల్యం రావడమే కాకుండా.. ఉద్యోగులకూ ఇల్లు, ఆఫీసు రెండింటి నుంచి పనిని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని