Swiggy decacorn: ‘డెకాకార్న్‌’గా స్విగ్గీ.. భారత్‌లో రెండో సంస్థ!

ఫుడ్‌ డెలిరీ సంస్థ స్విగ్గీ దేశంలో రెండో అత్యంత విలువైన అంకుర సంస్థగా అవవరించింది. ఇటీవల జరిగిన నిధుల సమీకరణలో ఈ కంపెనీ 700 మిలియన్‌ డాలర్లను సమీకరించింది....

Published : 24 Jan 2022 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫుడ్‌ డెలిరీ సంస్థ స్విగ్గీ దేశంలో రెండో అత్యంత విలువైన అంకుర సంస్థగా అవతరించింది. ఇటీవల జరిగిన నిధుల సమీకరణలో ఈ కంపెనీ 700 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. దీంతో కంపెనీ విలువ రెండింతలై 10.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ తర్వాత ఇదే అత్యంత విలువైన అంకుర సంస్థగా నిలిచింది. 

సంస్థ విలువ 10 బిలియన్‌ డాలర్లు దాటడంతో కంపెనీ ‘డెకాకార్న్‌’ స్టార్టప్‌ జాబితాలో చేరింది. బిలియన్‌ డాలర్లు విలువ చేసే స్టార్టప్‌లను యూనికార్న్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో పది బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘డెకాకార్న్‌’ అనీ, వంద బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘హెక్టాకార్న్‌’ లేదా ‘సూపర్‌ యూనికార్న్‌’ కంపెనీలనీ అంటున్నారు.

తాజా నిధుల సమీకరణలో సిగ్గీకి ఇన్వెస్కో కంపెనీ అత్యధిక పెట్టుబడులు సమకూర్చింది. ఈ జాబితాలో బారన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌, సుమేరు వెంచర్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ లేట్‌ స్టేజ్‌ టెక్‌ ఫండ్‌, కొటాక్‌, యాక్సిస్‌ గ్రోత్‌ అవెన్యూస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. డెకాకార్న్‌గా మారిన స్విగ్గీ 8 బిలియన్ డాలర్లు విలువ చేసే ఓయో, డ్రీమ్స్‌ స్పోర్ట్ వంటి కంపెనీలను వెనక్కి నెట్టి ఈ జాబితాలో చేరింది.

ఫుడ్‌ డెలివరీతోపాటు, ఆన్‌లైన్‌ గ్రోసరీ బిజినెస్‌ ఊపందుకుంటున్న తరుణంలో స్విగ్గీలోకి ఈ పెట్టుబడులు రావడం గమనార్హం. గత ఏడాది వ్యవధిలో కంపెనీ ఫుడ్‌ డెలివరీ విభాగం ‘గ్రాస్‌ ఆర్డర్ వాల్యూ’ రెండింతలైంది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు తాజా పెట్టుబడులు దోహదం చేయనున్నాయి. అదే సమయంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న క్విక్‌ కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్‌ బలోపేతానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని