Apple: అడ్డంకులున్నా.. ఆగని యాపిల్‌ ఆదాయం!

సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, చిప్‌ల కొరత.. ఈ అడ్డంకులేవీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యాపిల్‌ పయనానికి అడ్డుపడలేదు....

Published : 28 Jan 2022 19:12 IST

కాలిఫోర్నియా: సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, చిప్‌ల కొరత.. ఈ అడ్డంకులేవీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యాపిల్‌ పయనానికి అడ్డుపడలేదు. 2021 చివరి త్రైమాసికంలో ఐఫోన్ల ద్వారా సంస్థకు వచ్చే ఆదాయం ఏకంగా 9 శాతం పెరిగి 71.06 బిలియన్‌ డాలర్లకు చేరింది. జవనరి-మార్చిలోనూ ఇదే జోరు కొనసాగనుందని కంపెనీ అంచనా వేసింది.

ఐఫోన్‌ 13 ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్ధమాన దేశాల్లోనూ ఈ ఫోన్‌కు మంచి గిరాకీ వచ్చిందని పేర్కొంది. ఇక క్రియాశీలక యాపిల్‌ పరికరాల సంఖ్య ఇప్పుడు 1.08 బిలియన్లకు చేరిందని కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు.

ఉత్పత్తుల ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయంలో 104.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. ఇక సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం రికార్డు స్థాయిలో 24 శాతం పెరిగి 19.5 బిలియన్ డాలర్లు చేరింది. ఇక మ్యాక్‌ ద్వారా వచ్చే ఆదాయం సైతం రికార్డు స్థాయిలో పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ఈ విభాగంలో 25 శాతం వృద్ధి నమోదైంది. ఎం1 ఆధారిత మ్యాక్‌బుక్‌ ప్రోకు మంచి గిరాకీ లభించడమే మ్యాక్ ఆదాయ వృద్ధికి దోహదం చేసిందని కంపెనీ తెలిపింది.

ఐప్యాడ్‌ నుంచి వచ్చే ఆదాయం మాత్రం నిరాశపర్చింది. క్రితం ఏడాదితో పోలిస్తే.. ఈ విభాగపు ఆదాయం 14 శాతం కుంగి 7.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఇక వేరబుల్స్‌, గృహ పరికరాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 13 శాతం పెరిగి 14.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది కూడా ఆల్‌ టైం రికార్డు కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని