5G: 5జీ సేవలతో విమానాలకు ముప్పు.. నిజమెంత?

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేస్తున్నాయి. దీనికి కారణం 5జీ సేవల ప్రారంభం...

Updated : 19 Jan 2022 17:26 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేస్తున్నాయి. వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్దవ్వడమో, ఆలస్యం కావడమో జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఇందువల్ల ప్రయాణికులు, సరకు రవాణా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి.

ఎయిరిండియా సైతం నేడు అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌, ఏఎన్‌ఏ హోల్డింగ్స్‌, కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌ సైతం అదే బాటలో పయనించాయి.

సమస్య ఏంటి?

అమెరికాలో బుధవారం నుంచి కొత్త సీ-బ్యాండ్‌ 5జీ సేవలను వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ సంస్థలు ప్రారంభించనుండడమే అందుకు ఇందుకు కారణం. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

సమస్య ఎక్కడొస్తుందంటే...

విమాన తయారీ సంస్థలు, విమానయాన సంస్థల ఆందోళనతో 5జీ సేవల ప్రారంభాన్ని అమెరికాలో ఇప్పటికే రెండుసార్లు టెలికాం సంస్థలు వాయిదా వేశాయి. విమానాలు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నాయో గణించేందుకు ఉపయోగపడే ఆల్టీమీటర్ల వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే, అత్యంత వేగంగా డేటా బదిలీకి వీలు కల్పించే 5జీ సేవల స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ ఉంటోంది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

5జీ సేవలు ప్రారంభించిన 36 గంటల్లోపే విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా విమాన సేవల సంస్థలు పేర్కొన్నాయి. బోయింగ్‌ 777ఎస్‌ వంటి విమానాలు ల్యాండింగ్‌ అయ్యే అవకాశం ఉండదని ఒక అధికారి తెలిపారు. బోయింగ్‌ కార్గో విమానాలు సైతం నిలిచిపోవచ్చని చెప్పారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) సూచనలకు అనుగుణంగా విమానాశ్రయాల రన్‌వే చుట్టూ రెండు మైళ్ల పరిధి వరకు మినహాయించి, 5జీ సేవలను ప్రారంభించాలని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా, యునైటెడ్‌, సౌత్‌వెస్ట్‌, యూపీఎస్‌, అలస్కా ఎయిర్‌, అట్లాస్‌ ఎయిర్‌, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌, ఫెడ్‌ఎక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి విమానయాన సంస్థలు.. శ్వేతసౌధ జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్‌, రవాణా కార్యదర్శి, ఎఫ్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్‌, ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ ఛైర్‌వుమన్‌లకు లేఖ రాశాయి. ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా, 5జీ సేవలు ప్రారంభం కంటే ముందుగానే విమానాలను నిలిపివేయాలని సంస్థలు యోచిస్తున్నాయి.

వెరైజన్‌.. ఏటీ అండ్‌ టీ ఏమంటున్నాయి?

తమ పరికరాలేవీ విమానాల ఎలక్ట్రానిక్స్‌కు ఆటంకం కలిగించబోవని ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ తెలిపాయి. ఈ సాంకేతికతను అనేక దేశాల్లో సురక్షితంగా వినియోగిస్తున్నారనీ వివరించాయి. అయితే, ఆందోళనల నేపథ్యంలో తమ ఎయిర్‌పోర్టుకు 2 మైళ్ల పరిధిలో ఉన్న తమ 5జీ టవర్లను ఆన్‌ చేయబోమని ప్రకటించాయి. అయితే, ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుందో మాత్రం వెల్లడించలేదు. అధ్యక్షుడు బైడెన్ దీనిపై స్పందిస్తూ.. కార్గో, ప్రయాణికుల విమాన సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.

5జీ అమల్లో ఉన్న ఇతర ప్రాంతాల మాటేంటి?

ఐరోపా సమాఖ్య పరిధిలో 2019లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, 3.4- 3.8 గిగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు అనుమతినిచ్చాయి. అమెరికాలో ప్రస్తుతం అమల్లోకి రానున్న దానితో పోలిస్తే ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ. దీనికి సంబంధించిన బ్యాండ్లను ఇప్పటికే అనేక ఐరోపా సమాఖ్య సభ్యదేశాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నాయి. దాదాపు 31 దేశాల విమానయాన సంస్థల్ని పర్యవేక్షిస్తున్న ‘యురోపియన్‌ యూనియన్ ఏవియేషన్‌ సెఫ్టీ ఏజెన్సీ (EASA)’ తాజా సమస్యపై స్పందించింది. ప్రస్తుతం అమెరికాలో తలెత్తిన ఆందోళన కేవలం ఆ ఒక్క దేశానికే పరిమితమని వివరించింది. అలాగే దక్షిణ కొరియాలో 5జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ ఫ్రీక్వెన్సీ 3.42-3.7 గిగాహెర్ట్జ్‌ మధ్య ఉంది. ఏప్రిల్‌ 2019లో అందుబాటులో వచ్చిన ఈ సేవలు ఇప్పటి వరకు ఎలాంటి అంతరాయం కలిగించిన దాఖలాలు లేవు. భారత్‌లోనూ పలు టెలికాం సంస్థలకు విక్రయించిన స్పెక్ట్రం 3.5 గిగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీ రేంజ్‌లోనే అందుబాటులో ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని