Lockdown ఎఫెక్ట్‌: రూ. 5లక్షల కోట్ల నష్టం

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటివి అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాలు

Published : 27 Apr 2021 16:12 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటివి అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాలు దేశీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.  కరోనా ఆంక్షల కారణంగా వ్యాపార రంగంలో రూ. 5లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అఖిల భారత వాణిజ్య సమాఖ్య(సీఐఏటీ) వెల్లడించింది. 

కొవిడ్‌ ఉద్ధృతితో దేశ వాణిజ్య రాజధాని ముంబయి, దేశ రాజధాని దిల్లీ సహా పలు నగరాలు, పట్టణాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఏఐటీ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రిటైల్‌ ట్రేడర్లు రూ. 3.5లక్షల కోట్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు రూ. 1.5లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. పలు రాష్ట్రాల్లోని మర్చంట్‌ ఆర్గనైజేషన్‌లతో సీఏఐటీ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక రూపొందించింది. 

కస్టమర్ల తాకిడి ఒక్కసారిగా పడిపోవడంతో ట్రేడర్లకు నష్టం వచ్చినట్లు తెలిపింది. ఆంక్షల నేపథ్యంలో దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య 80శాతం మేర పడిపోయినట్లు పేర్కొంది. ప్రధాన నగరాల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది. దిల్లీలో వ్యాపారులు కేవలం 25 రోజుల వ్యవధిలో రూ. 25వేల కోట్ల మేర వ్యాపారం కోల్పోయినట్లు తెలిపింది. 

కరోనా రెండో దశ ఇప్పటికే అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని, దీనివల్ల నిరుద్యోగ సమస్య కూడా నానాటికీ పెరుగుతోందని పలు రంగాల నిపుణులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని