Stock market: మార్కెట్లకు హ్యాట్రిక్‌ నష్టాలు.. 3 రోజుల్లో ₹6.5 లక్షల కోట్లు ఫట్‌!

దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలు చవిచూశాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల మార్కెట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం మరో కారణం.

Updated : 20 Jan 2022 16:19 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల మార్కెట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడం మరో కారణం. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 600కు పైగా పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 17,800 దిగువకు చేరింది. గత మూడ్రోజుల్లో దాదాపు 1800 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.51గా ఉంది.

ఉదయం 60,045.48 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఒక దశలో వెయ్యి పాయింట్లు కోల్పోయిన సూచీ చివర్లో కోలుకుని 59,464.62 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 181.40 పాయింట్లు నష్టపోయి 17,757 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, దివీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌, రియల్టీ, మెటల్‌ రంగాల షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి.

మూడ్రోజుల్లో ₹6.50 లక్షల కోట్లు
మదుపరుల అప్రమత్తతో దలాల్‌స్ట్రీట్‌లో గత మూడ్రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 1800 పాయింట్లు కోల్పోవడంతో రూ.6.56 లక్షల కోట్ల మదుపరుల సంపద హరించుకుపోయింది. సోమవారం నాటికి బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.280 లక్షల కోట్లు ఉండడగా.. గురువారం నాటికి ఆ మొత్తం రూ.273 లక్షల కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని