Sitharaman: ‘యాంత్రిక్స్‌-దేవాస్‌ ఒప్పందం యూపీఏ ప్రభుత్వ అవినీతికి నిదర్శనం’

యాంత్రిక్స్‌-దేవాస్‌ కేసుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వాగతించారు. ఈ సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు....

Published : 18 Jan 2022 21:28 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: యాంత్రిక్స్‌-దేవాస్‌ కేసుపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వాగతించారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు సమగ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని యూపీఏ ప్రభుత్వం 2011లోనే రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదొక తప్పుడు ఒప్పందం అని తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

ఒప్పందం పూర్తిగా అవినీతితో కూడుకున్నదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై సీతారామన్‌ విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం యావత్‌ దేశంపై జరిగిన మోసంగా అభివర్ణించారు. యాంత్రిక్స్‌తో కుదిరిన ఒప్పందంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో దేవాస్ మల్టీమీడియా మూసివేయాలని ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మోసపూరిత చర్యల వల్ల దేవాస్‌, దాని వాటాదారులు లబ్ధి పొందేందుకు అనుమతిస్తే సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

దీనిపై నేడు సీతారామన్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక ప్రజా ఆస్తులైన వేవ్‌లెంగ్త్‌, శాటిలైట్లు, స్పెక్ట్రం వంటి వాటిని ప్రైవేటు సంస్థలకు విక్రయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వపు అవినీతి లక్షణాన్ని బయటపెడుతోందని దుయ్యబట్టారు. ఒప్పందం రద్దుకు వ్యతిరేకంగా దేవాస్‌ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుకు వెళితే.. అప్పటి ప్రభుత్వం కనీసం ఆర్బిట్రేటర్‌ను కూడా నియమించలేదని ఆరోపించారు. 21 రోజుల్లోగా ఆర్బిట్రేటర్‌ను నియమించాలని కోర్టు కోరినా స్పందించలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎలా అవలంబించిందో సుప్రీం తీర్పులో స్పష్టంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందం జాతీయ భద్రతకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీదే కీలక పాత్ర అని ఆరోపించారు. సుప్రీం తీర్పు ద్వారా ఇది స్పష్టమైందన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని డిమాండ్‌ చేశారు.  

ఏమిటీ వివాదం?

దేవాస్‌ మల్టీమీడియా బెంగళూరు సంస్థ. పలువురు అమెరికా వ్యాపారవేత్తలు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. 2005 జనవరిలో యాంత్రిక్స్‌, దేవాస్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. యాంత్రిక్స్‌ రెండు ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలి. ఈ ఉపగ్రహాల ద్వారా 70 మెగాహెర్ట్జ్‌ల ఎస్‌-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు అందుబాటులోకి తీసుకురావాలి. ఉపగ్రహ, భౌగోళిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో కూడిన మిశ్రమ సేవలను అందించేందుకు ఆ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవాలన్నది దేవాస్‌ ప్రణాళిక. అయితే- 2011 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని యాంత్రిక్స్‌ రద్దు చేసుకుంది. భారత ప్రభుత్వ విధాన నిర్ణయానికి కట్టుబడి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, అవినీతి ఆరోపణలు రావడంతోనే అప్పటి మన్మోహన్‌ సర్కార్‌ దీనిపై వెనక్కి తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఒప్పందం రద్దుపై దేవాస్‌ మల్టీమీడియా పలు అంరత్జాతీయ కోర్టులను ఆశ్రయించింది. ఈ క్రమంలో యాంత్రిక్స్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. దేవాస్‌ మల్టీమీడియా కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకుగానూ భారీ మొత్తంలో జరిమానా విధించింది. వడ్డీతో కలిపి దేవాస్‌కు ఏకంగా రూ.8.9 వేల కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

ఒప్పందం రద్దుపై తొలుత దేశవ్యాప్తంగా వివిధ న్యాయ వేదికలను దేవాస్‌ ఆశ్రయించింది. సుప్రీం కోర్టు తలుపు కూడా తట్టింది. ట్రైబ్యునల్‌ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం సూచించింది. 2018 సెప్టెంబరులో వెస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టును దేవాస్‌ మల్టీమీడియా ఆశ్రయించింది. అనంతరం అదే ఏడాది నవంబరులో యాంత్రిక్స్‌ కూడా ఆ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. 

కానీ, చివరకు 2021లో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సూచనల మేరకు బెంగళూరులోని ఎన్‌సీఎల్‌టీని యాంత్రిక్స్‌ ఆశ్రయించింది. మోసం జరిగిందన్న ఆరోపణలతో ఏకీభవించిన ఎన్‌సీఎల్‌టీ దేవాస్‌ను మూసివేయాలని తీర్పునిచ్చింది. అనంతరం ఎన్‌సీఎల్‌ఏటీ, సుప్రీంకోర్టు సైతం ఈ తీర్పును సమర్థించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని