Q3 Results: రతన్‌కు నష్టాలు.. ఐడీబీఐకి లాభాలు.. పలు కంపెనీల క్యూ3 ఫలితాలు

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ కొనసాగుతోంది. ఈరోజు పలు కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించాయి. రతన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాల్ని నమోదు చేసింది...

Updated : 21 Jan 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ కొనసాగుతోంది. ఈరోజు పలు కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించాయి. రతన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాల్ని నమోదు చేసింది. క్రితం ఏడాది నమోదైన రూ.69.09 కోట్ల నష్టాలు కాస్తా ఈసారి రూ.386.69 కోట్లకు ఎగబాకాయి. నాసిక్‌లోని అనుబంధ థర్మల్‌ విద్యుత్కేంద్రం (సిన్నార్‌ పవర్‌ లిమిటెడ్‌) పనిచేయకపోవడమే నష్టాల పెరుగుదలకు కారణమని కంపెనీ తెలిపింది. అయితే, రతన్‌ఇండియా పవర్‌ లిమిటెడ్‌ ఫలితాల్లో సిన్నార్‌ పవర్‌ గణాంకాలను కూడా కలిపి చెబుతున్నారు. సిన్నార్‌ పవర్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇంకా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో అప్పులు మీద పడి నష్టాలుగా మారాయని తెలిపారు. అయితే, ఈ అప్పులతో రతన్‌ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇక కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.857.15 కోట్లుగా నమోదైంది. అయితే స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కంపెనీ నికర లాభాలు మాత్రం రూ.33.44 కోట్ల నుంచి రూ.104.44 కోట్లకు పెరిగాయి. స్టాండ్‌ఎలోన్‌ ఆదాయం సైతం రూ.389.99 కోట్ల నుంచి రూ.855.18 కోట్లకు చేరింది.

* ఎల్‌ఐసీ ప్రమోట్‌ చేస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 53 శాతం పెరిగి రూ.578 కోట్లుగా నమోదైంది. ఇక ఆదాయం మాత్రం రూ.6,003.91 కోట్ల నుంచి రూ.5,772.86 కోట్లకు పడిపోయింది. బ్యాంకు వడ్డీ ఆదాయం 31 శాతం పెరిగి రూ.2,383 కోట్లకు చేరింది.

* హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నికర లాభాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.264.99 కోట్ల లాభాలతో పోలిస్తే.. అవి ఈసారి రూ.273.65 కోట్లకు చేరాయి. ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది. డిసెంబరు 2020లో సంస్థ ఆదాయం రూ.21,126.80 కోట్లు ఉండగా.. అది ఈసారి రూ.14,222.22 కోట్లకు చేరింది.

* వేదాంతకు చెందిన హిందూస్థాన్‌ జింక్‌ లాభం 22.7 శాతం వృద్ధి చెంది రూ.2,701 కోట్లకు చేరింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం క్రితం ఏడాది నమోదైన రూ.6,483 కోట్ల నుంచి రూ.8,269 కోట్లకు చేరింది.

* ఎఫ్‌ఎంసీజీ సంస్థ జ్యోతి ల్యాబ్స్‌ లాభంలో 28.57 శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.482.99 కోట్ల నుంచి రూ.542.66 కోట్లకు చేరింది. 

* మల్టీప్లెక్స్‌ చైన్‌ ఆపరేటర్‌ పీవీఆర్‌ లిమిటెడ్‌ పన్ను చెల్లించిన తర్వాతి నష్టాలు రూ.10.2 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఈ నష్టాలు రూ.49.21 కోట్లుగా ఉన్నాయి. ఇక సంస్థ ఆదాయం రూ.320.13 కోట్ల నుంచి రూ.709.71 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని