ఇంధన వినియోగం జంప్‌.. మళ్లీ సాధారణ స్థితికి!

దేశంలో ఇంధన వినియోగం పుంజుకుంటోంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో.....

Published : 10 Jul 2021 17:38 IST

దిల్లీ: దేశంలో ఇంధన వినియోగం పుంజుకుంటోంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో ఇంధన వినియోగం దాదాపు 8 శాతం మేర పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ఈ మేరకు పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌సెల్‌ తాజాగా జూన్‌ నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

గతేడాది జూన్‌తో పోలిస్తే పెట్రోల్‌ వినియోగం 5.6 శాతం పెరిగి 2.4 మిలియన్‌ టన్నులకు చేరగా.. మే నెలతో పోలిస్తే 21 శాతం పెరిగింది. డీజిల్‌ విషయానికొస్తే మే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగి 6.2 మిలియన్‌ టన్నులకు చేరింది. గతేడాది జూన్‌తో పోలిస్తే 1.5 శాతం తగ్గడం గమనార్హం. మార్చి తర్వాత డీజిల్‌ వినియోగం పెరగడం ఇదే తొలిసారి.

గతేడాది విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఇంధన వినియోగం సాధారణ స్థితికి చేరుకోగా.. సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ వినియోగం పడిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఇంధన వినియోగం మళ్లీ పెరిగింది. మరోవైపు విమానాలకు ఉపయోగించే జెట్‌ ఇంధన వినియోగం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 16.2 శాతం మేర జెట్‌ ఇంధన వినియోగం పెరిగినప్పటికీ.. 2019 జూన్‌తో పోలిస్తే 61.7 శాతం తక్కువ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని