Omicron: వస్తున్నాయ్‌.. పోతున్నాయ్‌!

కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. డెల్టా, డెల్టాప్లస్‌, ఏవై.12 ఉత్పర్తివర్తనాల (మ్యుటేషన్ల) గురించి మరచిపోక ముందే తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ తెరపైకి వచ్చింది. వివిధ దేశాల్లో కొత్త ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చిన కొద్దికాలానికి మన రాష్ట్రంలోనూ ఆనవాళ్లు కనిపించాయి

Updated : 02 Dec 2021 05:12 IST

రాష్ట్రంలో 3,550 కరోనా ఉత్పరివర్తనాల కేసులు
వాటి బాధితులంతా సురక్షితమే
ఒమిక్రాన్‌ నేపథ్యంలో మళ్లీ చర్చ
ఈనాడు - అమరావతి

కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. డెల్టా, డెల్టాప్లస్‌, ఏవై.12 ఉత్పర్తివర్తనాల (మ్యుటేషన్ల) గురించి మరచిపోక ముందే తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ తెరపైకి వచ్చింది. వివిధ దేశాల్లో కొత్త ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చిన కొద్దికాలానికి మన రాష్ట్రంలోనూ ఆనవాళ్లు కనిపించాయి. అయితే... ఇప్పటివరకు బాధితులంతా సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. అసలు వారికి సోకిన కరోనాలో మ్యుటేషన్‌ ఉన్నట్లు బాధితులకు ఎవ్వరకీ తెలియదన్నారు.

రెండోదశ నుంచే నమూనాల పరీక్ష
కొవిడ్‌ రెండో దశ మొదలవడానికి ముందే ప్రతి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపుతున్నారు. వీటిని పరీక్షించి కరోనా ఉత్పరివర్తనాలను గుర్తిస్తున్నారు. కొత్త మ్యుటేషన్లు వచ్చినప్పుడల్లా తమవద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈక్రమంలో వివిధ రకాల ఉత్పరివర్తనాల కింద నమోదైన కేసులు 3,550 వరకు ఉన్నాయి. వీటిలో అల్ఫా (బి.1.1.7) కేసులు 1,097, డెల్టా (బి.1.617.2) కేసులు 2,052 వరకు ఉన్నాయి. అల్ఫా కేసులు అత్యధికంగా 324 చిత్తూరు జిల్లాలో, తక్కువగా 19 కేసులు కడప జిల్లాలో నమోదయ్యాయి.

డెల్టా కేసులైతే అత్యధికంగా కడప జిల్లాలో 424 వచ్చాయి. తక్కువగా 92 కేసులు కృష్ణా జిల్లాలో నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో తిరుపతిలో తొలి డెల్టాప్లస్‌ కేసు నమోదైంది. తాజాగా ఒమిక్రాన్‌ తీవ్రతపై స్పష్టత లేకున్నా... అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి కదలికలను నియంత్రిస్తే దాని వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చునని సీనియర్‌ వైద్యులు ఒకరు పేర్కొన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించే నమూనాలను సైతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని