AP News: డీజీపీ ఆఫీసుకు ఎందుకు?

గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

Updated : 25 Jan 2022 03:28 IST

పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కదా
తెదేపా నాయకులను అడ్డుకున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ

ఈనాడు, అమరావతి: గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు రాబోతున్నారని తెలుసుకుని తెదేపా కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో ముందే మూసేశారు.
నాయకులను అడ్డుకుని అపాయింటుమెంట్‌ లేనిదే డీజీపీ కార్యాలయంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అపాయింటుమెంట్‌ అడిగామని, డీజీపీ నుంచి స్పందన లేదని, అందుకే నేరుగా బయల్దేరామని తెదేపా నేతలు చెప్పారు. డీజీపీ కాకపోతే.. అదనపు డీజీనైనా (శాంతిభద్రతలు) కలిసి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించాలని కోరారు. దానికైనా అపాయింటుమెంట్‌ కావాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. తపాల్‌లో ఇచ్చి వెళతామన్నా అంగీకరించలేదు. ఇస్తే తమకివ్వాలని, లేదంటే తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పోనీ అదనపు ఎస్పీ తమను వెంటబెట్టుకుని వెళ్లాలని నేతలు కోరినా నిరాకరించారు. ప్రతిపక్షాలను ఇంత అవమానించకూడదని, రోడ్డుపై వినతిపత్రం తీసుకోవడమేంటని వర్ల ప్రశ్నించారు. మీకిస్తే డీజీపీకి విన్నపమిచ్చినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరిని పడితే వాళ్లను ఎలా పంపిస్తాం.. మీరు ప్రతిదాన్నీ ఇష్యూ చేయవద్దని డీఎస్పీ రాంబాబు వాగ్వాదానికి దిగారు. నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఆరుగురినైనా, కనీసం ముగ్గురినైనా పంపాలని విన్నవించినా ససేమిరా అన్నారు. దీంతో అక్కడే అదనపు ఎస్పీకి తెదేపా నేతలు విన్నపమిచ్చి అక్నాలెడ్జ్‌మెంటు తీసుకుని వెనుతిరిగారు.

‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అంటే తెదేపావారికి పోలీసులు సేవలందించరా? మా పార్టీవారిని ఎవరైనా హతమార్చినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని అంటారా? వీళ్ల వైఖరి చూస్తుంటే రేపు పోలీసు స్టేషన్‌లోకి కూడా రానిచ్చేలా లేరు’ అని విలేకరులతో మాట్లాడుతూ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సెక్యూరిటీ జోన్‌లోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దుండగులు దాడిచేస్తే ఏం చేశారని ఆలపాటి ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీ నాయకులను,   మాజీ మంత్రులను డీజీపీ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.


‘మీరు రోజూ ప్రతి అంశానికి డీజీపీని ముడిపెట్టి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. మీ పార్టీ తరఫున డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయండి. కానిస్టేబుల్‌నుంచి డీజీపీ వరకు పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా? మీకు డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి అపాయింటుమెంట్‌ లేదు. కావాలంటే ఆ వినతిపత్రం ఇక్కడే ఇచ్చి వెళ్లండి. మేం డీజీపీకి అందజేస్తాం’

-గుడివాడలో కేసినో వ్యవహారం, నిజనిర్ధారణకు వెళ్లిన పార్టీ నాయకులపై దాడికి సంబంధించి డీజీపీకి విన్నపమివ్వడానికి వెళ్లిన తెదేపా నాయకులతో గుంటూరు అర్బన్‌ అదనపు ఎస్పీ గంగాధరం వ్యాఖ్యలివి.


‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి మిమ్మల్ని డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టనివ్వబోమని కాగితంపై రాసివ్వండి. మరి కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఇక్కడ కంప్లెయింటే ఇవ్వబోనన్న జగన్‌ మాటలు కూడా మీరు వినకూడదు కదా? ఆయన చెప్పినట్టు ఎలా పనిచేస్తున్నారు? అయినా పోలీసులపై నమ్మకం లేదని నేను ఎప్పుడూ అనలేదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు.’

-తెదేపా నాయకుడు వర్ల రామయ్య స్పందన


‘పోలీసులపై నమ్మకం లేదని నేనన్నాను. గుడివాడలో తెదేపా నేతలపై జరిగిన దాడిపై డీఐజీని కలుస్తామంటే.. ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో మారుమూలన ఉన్నానని, రావడానికి అర్ధరాత్రి అవుతుందని చెప్పారు. సాయంత్రం ఐదింటికి ప్రెస్‌మీట్‌ పెట్టి తెదేపావారు అరాచకం చేయడానికే వచ్చారని చెప్పారు. మాకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ఏమనాలి?’

- తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని