పోలవరం అంచనాలపై అవగాహనకు వచ్చాం

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంతో సమావేశమై ఒక అవగాహనకు వచ్చామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వివిధ పెండింగ్‌ సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి, ఉక్కు, విమానయాన, మైనింగ్‌తో పాటు

Published : 25 Jan 2022 02:52 IST

రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపైనా చర్చించాం
వైకాపా నేత విజయసాయిరెడ్డి వెల్లడి
కేంద్ర కార్యదర్శుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంతో సమావేశమై ఒక అవగాహనకు వచ్చామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వివిధ పెండింగ్‌ సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి, ఉక్కు, విమానయాన, మైనింగ్‌తో పాటు పలు ఇతర శాఖల కార్యదర్శులు, పీఎంవో అధికారుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం నార్త్‌బ్లాక్‌లో సమావేశమైంది. విజయసాయిరెడ్డి నేతృత్వం వహించిన ఈ బృందంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్‌ దాస్‌, జవహర్‌రెడ్డి తదితరులున్నారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు సాగాయన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలిసి వివరించారని ఆయన తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి వివిధ శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేశారని.. వారితో తాము చర్చలు జరిపామని విజయసాయిరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామన్నారు. సమావేశం సానుకూలంగా సాగిందని, వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించామని విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులతో రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి, ఈ అంశాలను ముందుకు తీసుకెళతారని ఆయన వివరించారు. త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటుపైనా చర్చించామన్నారు. కేంద్ర బడ్జెట్‌ సమయంలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ సమావేశం నిదర్శనమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని