Updated : 26/11/2021 05:02 IST

Chandrababu: మద్యం డబ్బులతో.. సంక్షేమ పథకాలా?

ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణం
నెల్లూరులో బాధితులకు చంద్రబాబు పరామర్శ

చంద్రబాబునాయుడికి తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ

ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్‌.. ఇలాంటి కొత్త స్కీములు మరెన్నో తెస్తాడు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాపూరు, గంగపట్నం గ్రామాల్లో, నెల్లూరు నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గంగపట్నంలో కొట్టుకుపోయిన చెరువు కట్టలను, దెబ్బతిన్న ఇళ్లు, ఆక్వా చెరువులను పరిశీలించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి పలకరించారు. ఇళ్లన్నీ బురదమయమయ్యాయని మహిళలు విలపించగా.. నేనున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాగా మారి ఇసుక దోచుకుంటున్నారని, చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల కోసమే సోమశిల నుంచి దిగువకు నీళ్లు వదలకుండా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపించారు.

ఇళ్లు బాగుచేయడం ఎంతసేపు?

‘ప్రభుత్వం తలచుకుంటే.. దెబ్బతిన్న 150 ఇళ్లకు మరమ్మతులు ఎంతసేపు? మొద్దు నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిట్టాలంటే సభ్యత అడ్డొస్తోంది. కష్టాలు తీర్చలేని ఈ ప్రభుత్వం మనకెందుకు? రూ.2 వేల పరిహారంలోనూ తెదేపా అనుకూలురకు ఇవ్వడం లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. గంగపట్నంలో నష్టపోయిన కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున రూ.5వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. 10 గంటల పాటు స్తంభంపై ఉన్న ఇద్దరి ప్రాణాలు కాపాడిన మత్స్యకారుడు సురేష్‌కు ట్రస్టు తరఫున ప్రోత్సహిస్తామన్నారు. వరదల్లో చనిపోయిన పాలిటెక్నిక్‌ విద్యార్థి దుగ్గి గోపి తల్లి నాగమణితో మాట్లాడిన బాబు.. రూ.లక్ష సాయం ప్రకటించారు.


నెల్లూరు జిల్లా గంగపట్నంలో గిరిజన కుటుంబాన్ని పరామర్శించి, పూరింట్లో నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు

రూ.1కే ఇళ్ల రిజిస్ట్రేషన్‌

‘1983 నుంచి పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు, స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయడమేంటి? రిజిస్ట్రేషన్‌ కోసం ఎవరూ డబ్బు కట్టొద్దు. దీనిపై న్యాయపోరాటం చేద్దాం. తెదేపా అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే దీన్ని రద్దుచేసి, రూ.1కే రిజిస్ట్రేషన్‌ చేసిస్తామ’ని బాబు హామీ ఇచ్చారు.

పరిహారం అందించే వరకు పోరాడుతాం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 తుపాన్లు వచ్చాయి. ఇప్పటికీ నష్టపరిహారంపై విధివిధానాలు రూపొందించలేదని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తాజా వరదలకు చనిపోయిన వ్యక్తికి రూ.25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి రూ.20 వేలు, స్వల్పంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేలు ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు రూ.20 వేల పరిహారం, కోళ్ల పరిశ్రమలోని ఒక్కో కోడికి రూ.250, బ్రాయిలర్‌ కోడికి రూ.100, పౌల్ట్రీ షెడ్లు పూర్తిగా పోతే నిర్మించి ఇవ్వాల’ని డిమాండ్‌ చేశారు. ఈ విపత్తుపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రం తన వద్దనున్న విపత్తు నిధి నుంచి ముందు ఖర్చుపెట్టి.. తర్వాత కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనావేసిన ప్రభుత్వం.. వంద కోట్లయినా విడుదల చేయలేదు. కేంద్రాన్ని రూ.వెయ్యి కోట్లు ఇవ్వమంటే ఎందుకిస్తారు? ఇదే అనుభవం లేకపోవడమంటే’ అని సీఎం జగన్‌ను విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల ఆర్తనాదాలు వినకుండా, అసెంబ్లీలో తన చుట్టూ చేరే వారి భజనలకు ఆనందిస్తున్నారని విమర్శించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని