AP News: నిధుల మళ్లింపుపై సర్పంచుల నిరసన

పంచాయతీల ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయడాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు ఆందోళన చేపట్టారు. సీఎం సొంత జిల్లా కడపలోని ఖాజీపేట మండలానికి చెందిన పలువురు వైకాపా సర్పంచులు

Updated : 24 Nov 2021 11:23 IST

వైకాపాకి రాజీనామా చేస్తామని ఖాజీపేటలో ప్రకటన
ఆ ఆలోచన లేదని ఆ వెంటనే వెల్లడి
వట్టిచెరుకూరులో భిక్షాటన

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో భిక్షాటన చేస్తున్న సర్పంచులు

ఖాజీపేట, వట్టిచెరుకూరు, మామిడికుదురు, న్యూస్‌టుడే: పంచాయతీల ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయడాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు ఆందోళన చేపట్టారు. సీఎం సొంత జిల్లా కడపలోని ఖాజీపేట మండలానికి చెందిన పలువురు వైకాపా సర్పంచులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సాయంత్రానికి మళ్లీ సర్దుకుని... రాజీనామా ఆలోచన లేదన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలకేంద్రంలో పలు గ్రామాల సర్పంచులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో ఎంపీపీ కార్యాలయం ఎదుట సర్పంచులు ధర్నా చేశారు.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో నిరసన

పంచాయతీల ఖాతాల్లో రూపాయి లేదు
కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైకాపాకి చెందిన 20 మంది సర్పంచులలో 19 మంది, భూమాయపల్లె సర్పంచ్‌ వెంకటసుబ్బయ్య (తెదేపా) మంగళవారం ఖాజీపేట పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పి.శివరామిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వంపై వారంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. వైకాపాకి రాజీనామా చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడుతున్నామంటూ 12 మంది సంతకాలతో ప్రకటన విడుదల చేశారు. ‘8 నెలలుగా అన్ని రకాల పనులకూ సొంత నిధులు ఖర్చుచేయడంతో సర్పంచులు దివాళా తీసి రోడ్డున పడుతున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో సర్దుకున్న సర్పంచులు.. రాజీనామాపై వెనకడుగు వేశారు. ‘మాకున్న ఇబ్బందులపై సమావేశమయ్యాం. రాజీనామాలంటూ పొరపాటున ప్రచారం జరిగింది. మా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నాం. పార్టీకి, పదవులకు రాజీనామా చేసే ఉద్దేశం లేదు’ అని శివరామిరెడ్డి పేర్కొన్నారు.

కడప జిల్లా ఖాజీపేటలో సమావేశమైన సర్పంచులు

పంచాయతీల నిధులు తిరిగివ్వాలి
పంచాయతీల ఖాతాల నుంచి ప్రభుత్వం తీసుకున్న నిధుల్ని తిరిగివ్వాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సర్పంచులు గ్రామవీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ‘ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా కేంద్రం విడుదల చేసిన నిధుల్నీ లాక్కుంది. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలివ్వకుండా వీధులను ఎలా శుభ్రంగా ఉంచగలం?’ అని అనంతవరప్పాడు సర్పంచి వెంకటరావు ధ్వజమెత్తారు. నిధుల్ని లాగేసుకుంటే పనులు ఎలా చేయగలమని వట్టిచెరుకూరు సర్పంచి విజయకుమార్‌ ప్రశ్నించారు.

నిధులు మళ్లిస్తే అభివృద్ధి ఎలా?
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని సర్పంచులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. పంచాయతీల నిధుల్ని మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం ఈవోపీఆర్డీకి వినతిపత్రం అందించారు.

ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నాం
ఆర్థికసంఘం నిధులను ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసుకోవడంతో అన్యాయం జరుగుతోందని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. గత శనివారం రాత్రి పంచాయతీల ఖాతాలకు కేంద్ర నిధులు జమ కాగా తెల్లవారే వాటిని సర్కారు మళ్లించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని