YSRCP: కుప్పం వైకాపా వశమైందిలా!

రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన కుప్పం మున్సిపాలిటీ అధికార పార్టీ వశమైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న.....

Updated : 18 Nov 2021 10:46 IST

అధికార బలం.. మోహరించిన బలగం

కుప్పంలో వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి సుధీర్‌ను భుజాలకెత్తుకున్న కార్యకర్తలు

ఈనాడు-తిరుపతి, ఈనాడు- డిజిటల్‌ చిత్తూరు: రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన కుప్పం మున్సిపాలిటీ అధికార పార్టీ వశమైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి తొలిసారి జరిగిన పురపాలిక ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా, తెదేపాలు సర్వశక్తులూ ఒడ్డాయి. నామినేషన్ల నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. 25 వార్డులున్న పట్టణంలో ఒక స్థానాన్ని వైకాపా ఏకగ్రీవంగా గెలుచుకుంది. 24 వార్డులకు పోలింగ్‌ జరగ్గా.. 19 వైకాపా, 6 తెదేపా ఖాతాలో చేరాయి. ఇక్కడ గెలుపు కోసం వైకాపా అధికార, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని, ప్రచారం నుంచి పోలింగ్‌ వరకూ అక్రమాలకు పాల్పడిందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వాపోయారు.

ప్రతి దశలో పక్కాగా ప్రణాళిక
కుప్పంలో పాగా వేసేందుకు వైకాపా ముఖ్యనేతలు అక్కడే మోహరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, మండల పార్టీ నేతలు మకాం వేశారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి హామీలు ఇచ్చారు. తాము చెప్పిన వారికి ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లు, మెప్మా, వెలుగు సంఘాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టారని విమర్శలొచ్చాయి. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకూ ప్రతి దశలో పట్టు సడలకుండా పర్యవేక్షించారు. మరోపక్క, తెదేపా నాయకులను అరెస్టుచేసి రెండు రోజుల పాటు ప్రచారానికి ఆటంకం కలిగించారన్న వాదనలున్నాయి. పోలింగ్‌కు ముందురోజు కొందరు నాయకులను అదుపులోకి తీసుకొని, తర్వాత వదిలేశారు. దీంతో శ్రేణులు డీలా పడ్డాయని చెబుతున్నారు. తెదేపా నుంచి తొలుత అభ్యర్థులుగా ఎంచుకున్న కొందరు నాయకులు.. తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి పోటీకి ముందుకు రాకపోవడం, అప్పటికప్పుడు కొత్తవారిని బరిలో నిలపాల్సి రావడం, బూత్‌ ఏజెంట్లు బలహీనంగా ఉండటం వైకాపాకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక తెదేపా నాయకులపై ఉన్న వ్యతిరేకత కూడా ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు