Oxygen on Moon: జాబిల్లి ‘ఊపిరి’తలం!

అంతరిక్షయానాలు పెరుగుతున్నాయి. చందమామపైకి మానవసహిత యాత్రలు కొన్నేళ్లలో ప్రారంభం కానున్నాయి. అక్కడ మానవ ఆవాసాల ఏర్పాటు ఆలోచనలూ ఊపందుకుంటున్నాయి. ఈ

Updated : 13 Nov 2021 11:13 IST

చందమామ నేలపై అపారంగా ప్రాణ వాయువు

ప్రపంచ జనాభాకు లక్ష సంవత్సరాలకు సరిపడా నిల్వలు

వెలికి తీయడమే తరువాయి..

బ్రిస్బేన్‌: అంతరిక్షయానాలు పెరుగుతున్నాయి. చందమామపైకి మానవసహిత యాత్రలు కొన్నేళ్లలో ప్రారంభం కానున్నాయి. అక్కడ మానవ ఆవాసాల ఏర్పాటు ఆలోచనలూ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోదసిలోని వనరులను సమర్థంగా వినియోగించుకునే పరిజ్ఞానాలపై శాస్త్రవేత్తల దృష్టి పెరిగింది. ముఖ్యంగా ప్రాణులకు జీవాధారమైన ఆక్సిజన్‌ను చంద్రుడి నుంచి సేకరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆస్ట్రేలియా తయారుచేసిన ఒక రోవర్‌ను జాబిల్లి ఉపరితలంపై ప్రవేశపెట్టేందుకు అమెరికాతో ఒక ఒప్పందం కుదిరింది. చంద్రుడి నేల నుంచి శిలలను సేకరించి, వాటి ద్వారా శ్వాసకు యోగ్యమైన ఆక్సిజన్‌ను తయారు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

చంద్రుడి వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అందులో హైడ్రోజన్‌, నియాన్‌, ఆర్గాన్‌ ఎక్కువగా ఉన్నాయి. ఈ వాయు మిశ్రమం.. ఆక్సిజన్‌పై ఆధారపడే మానవుల మనుగడకు దోహదపడదు. అలాగని అక్కడ ప్రాణవాయువు లేదని కాదు. అది అపారంగా ఉంది. కాకుంటే అది వాయు రూపంలో లేదు. చంద్రుడి మట్టి (రెగోలిథ్‌) కింద నిక్షిప్తమై ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దాన్ని వెలికితీస్తే చంద్రుడిపై మానవ జీవనానికి సరిపోతుందని చెబుతున్నారు.


ఖనిజాల్లో భాగంగా.. 

జాబిల్లిపై సిలికా, అల్యూమినియం, ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆక్సిజన్‌ ఉంటుంది. అయితే అది మన ఊపిరితిత్తులకు అనువైనది కాదు. ఈ ఖనిజాలు కఠిన శిల, ధూళి, కంకర, రాళ్లతో కూడిన మిశ్రమంలో ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పొరను ‘మట్టి’గా కొందరు పిలుస్తుంటారని, అది తప్పని పలువురు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. మట్టికి మాతృక రెగోలిథ్‌ అని వారు చెబుతున్నారు. భూమిపై మొదట ఉన్న రెగోలిథ్‌ను సూక్ష్మజీవులు మట్టిగా మార్చాయని వివరించారు. దీనివల్ల అంతకుముందు లేని కొన్ని ఖనిజాలు అందులో ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అయితే చందమామ ఉపరితలంపై ఉన్న రెగోలిథ్‌ మట్టి రూపును సంతరించుకోలేదని తెలిపారు.


ఇవే సవాళ్లు

చంద్రుడి రెగోలిథ్‌లో దాదాపు 45 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. అయితే సంబంధిత ఖనిజాలతో అది దృఢ బంధాన్ని ఏర్పర్చుకొని ఉంటుంది. దీన్ని ఛేదించడానికి శక్తిని ఉపయోగించాలి. ఇందుకు ఎలక్ట్రోలసిస్‌ అక్కరకొస్తుంది. భూమిపై అల్యూమినియం వంటి లోహాల ఉత్పత్తికి దీన్ని వాడుతుంటారు. అందులో.. ద్రవరూప అల్యూమినియం ఆక్సైడ్‌లోకి కరెంటును పంపుతారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ నుంచి అల్యూమినియాన్ని వేరు చేస్తారు. ఇందులో ఆక్సిజన్‌ ఉప ఉత్పత్తిగా వస్తుంది. అయితే చంద్రుడి విషయానికొస్తే ఆక్సిజనే ప్రధాన ఉత్పత్తి. ఇది చాలా సులువైన విధానమే అయినప్పటికీ దీనికి అపార శక్తి అవసరమవుతుంది. అందువల్ల దీన్ని ఆచరణయోగ్యంగా చేయాలంటే సౌరశక్తి లేదా చంద్రుడిపై అందుబాటులో ఉన్న ఇతర వనరులను ఉపయోగించాలి. దీనికితోడు జాబిల్లి రెగోలిథ్‌ నుంచి గణనీయ స్థాయిలో ఆక్సిజన్‌ను సేకరించాలంటే భారీగానే పారిశ్రామిక సాధన సంపత్తి అవసరం. మొదట ఘన లోహపు ఆక్సైడ్‌ను ద్రవ రూపంలోకి మార్చాలి. దీన్ని చేపట్టడానికి అవసరమైన పరిజ్ఞానం భూమిపై అందుబాటులోనే ఉంది. అయితే ఆ సాధనసంపత్తిని చంద్రుడిపైకి తరలించడం సవాలే.


ముందడుగు..

ఎలక్ట్రాలసిస్‌ ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రయోగాత్మకంగా మూడు రియాక్టర్లను నిర్మిస్తున్నట్లు బెల్జియంకు చెందిన ‘స్పేస్‌ అప్లికేషన్స్‌ సర్వీసెస్‌’ ఇటీవల పేర్కొంది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ‘ఇన్‌-సిటు రిసోర్స్‌ యుటిలైజేషన్‌’ (ఐఎస్‌ఆర్‌యూ) ప్రాజెక్టు కింద 2025 నాటికి చంద్రుడిపైకి ఈ సాంకేతికతను పంపాలని ఆ సంస్థ భావిస్తోంది.


ఎంత ఆక్సిజన్‌ ఉండొచ్చు?

చంద్రుడి లోతుల్లో ఉన్న కఠిన శిలాపదార్థంలోని ఆక్సిజన్‌ను వదిలేసి, ఉపరితలంపై సులువుగా అందుబాటులో ఉన్న రెగోలిథ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా అక్కడ భారీగానే ప్రాణవాయువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వీరి విశ్లేషణ ప్రకారం..  ప్రతి క్యూబిక్‌ మీటరు రెగోలిథ్‌లో 1.4 టన్నుల మేర ఖనిజాలు ఉంటాయి. అందులో ఆక్సిజన్‌ వాటా 630 కిలోలు.

* మనిషికి రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్‌ అవసరం. ఈ లెక్కన 630 కిలోలతో ఒక మనిషి దాదాపు రెండేళ్లపాటు మనుగడ సాగించొచ్చు.

* చంద్రుడిపై సరాసరిన రెగోలిథ్‌ 10 మీటర్ల లోతు వరకూ విస్తరించి ఉంది. దాని నుంచి పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ను వెలికితీయగలిగితే భూమి మీదున్న 800 కోట్ల మందికి లక్ష ఏళ్ల పాటు ప్రాణవాయువును అందించొచ్చు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని