Updated : 05/11/2021 08:01 IST

China: చైనాలో ఆహార సంక్షోభం!

వరదలతో దెబ్బతిన్న పంటలు
కొవిడ్‌తో సరకుల రవాణాకు తీవ్ర విఘాతం
వీటికి తోడు డ్రాగన్‌ స్వయంకృతాపరాధాలు

ఆహారవృథాను నియంత్రించడంలో భాగంగా పాఠశాలల్లో ‘క్లీన్‌ ప్లేట్‌’ అమలు

బీజింగ్‌: ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనాలో ఆహార సంక్షోభం ముంచుకొస్తుందా! అవుననే అంటున్నాయి ఆ దేశ పాలకులు ఇటీవల చేస్తున్న ప్రకటనలు. ‘సరకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి. పొట్టుతీయని ధాన్యాలు తినండి. పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి’ అంటూ రాబోయే కష్టాలపై ప్రజలకు సంకేతాలిస్తున్నారు. ‘శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు.. ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి’, ‘ఎవరైనా బింజ్‌ (ఎక్కువగా తిండితినే) వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తే శిక్షిస్తాం’ అనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. కొవిడ్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సరకుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది, శీతాకాలం దృష్ట్యా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నామని చైనా పాలకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అయితే, ఆ దేశంలో సమస్య ఎంతో తీవ్రంగా ఉంటేనే బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రభుత్వం నుంచి చిన్నచిన్న ప్రకటనలు వెలువడుతుంటాయి. తాజా ఆహార సంక్షోభం కూడా అదే కోవకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రెండ్రోజుల క్రితం చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌లో ఓ చిన్న వార్త వెలువడింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావొచ్చు.. చైనీయులు ముందుగానే సరకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి’ అన్నది దీని సారాంశం. దీంతో పాటు సరకు రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నందున పండ్లు, కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసుకోవాలని సూచించింది. కొరతలో ఉన్న ధాన్యాలు, కూరగాయలను ఎంచుకొని రైతులు పండించాలని, యంత్రాలను వినియోగించి వృథాను కట్టడి చేయాలని పేర్కొంది. బయటకు చెబుతున్న దానికన్నా ఆ దేశంలో సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఈ పరిణామాలన్నీ సూచిస్తున్నాయి.

దాదాపు ఏడాదిన్నర నుంచి చైనాలో ఆహార కొరత విషయమై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ దేశ తీరప్రాంతాల్లో 1000 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి 2019 నాటికి చైనాలో 23,841 డ్యామ్‌లు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనకట్టల్లో 41శాతానికి ఇవి సమానం. వీటిల్లో అత్యధికంగా 2,000 సంవత్సరం తర్వాత నిర్మించినవే. కానీ, చైనాలో కుంభవృష్టి వర్షాలు ఎక్కువ అన్న విషయాన్ని మరచిపోయి.. ఈ ఆనకట్టల్లో నీటిని కిందకి వదలకుండా భారీగా నిల్వ ఉంచుతున్నారు. రాత్రికి రాత్రి కురిసే భారీ వర్షాలకు ఇవి పొంగి.. పంటలను, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. గతేడాది త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కారణంగా సిచువాన్‌లో వచ్చిన వరదలే దీనికి నిదర్శనం. అత్యధిక జనాభా ఉండే సిచువాన్‌, షాంగ్జీ, హెనాన్‌ ప్రావిన్సులను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఫలితంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కూరగాయల ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలను మాంసం కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఆస్ట్రేలియాపై అలిగితే ఏమయిందంటే..

చైనాలో అత్యధిక విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతుంది. ఆస్ట్రేలియాతో వివాదాల కారణంగా.. అక్కడి నుంచి బొగ్గు కొనుగోళ్లను నిలిపివేసింది. ఇది ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని చైనా ఆశించింది. కానీ, ఆ నిర్ణయంతో విద్యుత్తు కొరత రూపంలో డ్రాగన్‌కే షాక్‌ తగిలింది. నగరాల వీధుల్లో లైట్లు కూడా వెలగని పరిస్థితుల్లో డీజిల్‌ నిల్వలను విద్యుత్తు ఉత్పత్తికి మళ్లించింది. దీంతో వాహనాలకు ఇంధన కొరత ఏర్పడింది. అసలే ఆహార కొరత.. ఆపై రవాణా సౌకర్యాలకు తగినంత డీజిల్‌ లేకపోవడంతో ధరలు పెరిగాయి. ఇటీవల డెల్టా వేరియంట్‌ చైనాలో విజృంభించడం మొదలు పెట్టింది. ఫలితంగా చాలా నగరాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా ఆహార కొరతను తీవ్రం చేస్తోంది.

పొదుపు చర్యలు

చైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే ‘బింజ్‌ ఈటింగ్‌’ (అతిగా తింటున్న) వీడియోలు తీసేవారిపై, ఆహారాన్ని వృథా చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలు పెట్టినట్లు ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక పేర్కొంది. సమావేశాల పేరుతో కంపెనీలు విలాసవంతమైన భోజనాలను ఏర్పాటు చేయడాన్ని చైనా నిషేధించింది. 2025 నాటికి ప్రజలకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించేందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో ఆహార వృథాను తగ్గించాలని స్పష్టంగా పేర్కొన్నారు. పందులు, కోళ్ల పెంపకంలో సోయాబీన్‌, మొక్కజొన్నను నేరుగా వినియోగించకుండా ధాన్యాలను శుద్ధి చేసినప్పుడు లభించే ఉప ఉత్పత్తులను వాడాలని రైతులకు సూచించారు. ఆహార పదార్థాలతో బయో ఇంధనాలు తయారు చేసే సంస్థలపై ఆంక్షలు విధించారు.  


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని