AP News: మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు... నిలబెట్టొచ్చు

‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం.

Updated : 06 Dec 2021 11:58 IST

ఉద్యోగుల కుటుంబసభ్యులతో కలిపితే మేం 60 లక్షల మంది

మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం

చచ్చిపోతున్నామన్నా జీతానికి దిక్కులేని పరిస్థితి

ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం. అందుకే మీరు మా వంక చూడట్లేదు’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ‘ఒకటో తేదీన జీతాలు పొందటమనేది ఉద్యోగుల హక్కు. అలాంటిది చచ్చిపోతున్నామన్న సరే ఇప్పుడు జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఒకటో తేదీన జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అందులోని ప్రధానాంశాలివీ.

ఆ విజయాలు ఆరిపోయే ముందు వెలుగులాంటివి: ‘చచ్చిపోయే (ఆరిపోయే) ముందు దీపం బాగా వెలుగుతుంది. జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో సాధించిన పిచ్చి పిచ్చి విజయాలు అలాంటివే’ అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాను తప్ప 5 డీఏలు ఇవ్వలేనని చెప్పిన చంద్రబాబుకు.. ఉద్యోగుల గురించి బాగా తెలుసని వివరించారు.

పాలు, కూరగాయలు అమ్మేవారికీ లోకువైపోయాం: ‘ప్రభుత్వోద్యోగులంటే ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు పాలు, కూరగాయలు అమ్మేవారికి కూడా లోకువైపోయాం. ప్రభుత్వోద్యోగులు దీనావస్థలోకి వెళ్లిపోయారు. సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అనే పరిస్థితిలోకి నెట్టేశారు’ అని విమర్శించారు. ఈ ఏడాది జులై 1న తాను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని.. ఆ నెల 29న తిరుపతిలో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘గతంలో ఎవరికైనా ఒకటో తేదీకి జీతం రాకపోతే ఆ విషయం గురించి కలెక్టర్‌కు టెలిగ్రామ్‌ ఇస్తే సంబంధిత డ్రాయింగ్‌ అధికారిని గందరగోళం చేసేసేవారు. ఇప్పుడు ఉద్యోగులు చచ్చిపోతున్నా జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది’ ఆని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ మోచేతి నీళ్లు తాగం..

‘మీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు. ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం తప్ప.. మీ దయాదాక్షిణ్యాలపై కాదు’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని బండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ‘రైతుల ఉద్యమానికి దిగి వచ్చి ప్రధానమంత్రి సైతం తప్పు అయిపోయింది.. క్షమించమన్నారు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి. ఈ రోజు నువ్వు చేసే ఉద్యమం నీ కోసం. నీ బిడ్డల కోసం. ఉద్యమం అంటే ఎలా ఉండాలో భావితరాలకు చెప్పటం కోసం’ అంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని