Updated : 02/12/2021 05:42 IST

AP CM: ఓటీఎస్‌పై దుష్ప్రచారం చేస్తే చర్యలు

సీఎం జగన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఈ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. చట్టపరంగా హక్కులు దఖలు పడతాయి. ఇంతలా మేలు చేసే పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు అవగాహన కల్పించాలి. పథకం వల్ల కలిగే మేలు లబ్ధిదారులకు చూపించాలి’ అని వివరించారు. సీఎంవో అధికారులతో సమావేశమై ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

ఓటీఎస్‌ స్వచ్ఛందమే: అజయ్‌జైన్‌
ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివిధ గృహ పథకాల కింద రుణాలు తీసుకుని చెల్లించని లబ్ధిదారులకు ఓటీఎస్‌ను స్వచ్ఛంద విధానంలోనే అమలు చేస్తున్నట్లు గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని, సంక్షేమ పథకాలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పథక ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించేందుకే వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించామని పేర్కొన్నారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో బుధవారం అజయ్‌జైన్‌ మాట్లాడుతూ.. ‘ఓటీఎస్‌ కొత్త పథకం కాదు. 2014 వరకు అమల్లో ఉంది. అప్పట్లో కేవలం లబ్ధిదారులు తీసుకున్న రుణంపైన వడ్డీని మాత్రమే మినహాయించారు. ఇప్పుడు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ పథకాన్ని మళ్లీ అమలు చేసేందుకు సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రస్తుత నిబంధల ప్రకారం లబ్ధిదారుడు తీసుకున్న రుణం, దానిపై వడ్డీ ఎంత ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలు కడితే రుణ విముక్తి పత్రాన్ని అందిస్తాం. అసలు, వడ్డీ కలిపి రూ.10 వేల కంటే తక్కువగా ఉంటే... ఆ మొత్తాన్ని చెల్లించినా సరిపోతుంది. 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకూ రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఓటీఎస్‌ విధానాన్ని మొదటి విడతలో రుణం తీసుకున్న లబ్ధిదారులు, వారి వారసులకు, ప్రభుత్వ పథకాల్లో ఇళ్లు మంజూరై సొంతంగా నిర్మించుకున్న వారికే పరిమితం చేస్తున్నాం. వీటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తాం. 21న రిజిస్ట్రేషన్‌ పత్రాలను సీఎం జగన్‌ లబ్ధిదారులకు అందిస్తారు. చేతులు మారిన ఇళ్లకు రెండో విడతలో ఓటీఎస్‌ అమలు చేస్తాం’ అని వెల్లడించారు.

సంతబొమ్మాళిలో జరిగింది.. కుట్రలా ఉంది : మంత్రి బొత్స
‘ఎవరి ప్రలోభానికి గురై సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఓటీఎస్‌పై సర్క్యులర్‌ జారీ చేశారో..? ఆ కుట్ర వెనుక ఉన్నదెవరో అన్నీ ప్రజల ముందుంచుతాం’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ‘తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని కార్యదర్శి సర్క్యులర్‌ ఇవ్వడం, దానిపై వెంటనే చంద్రబాబు, లోకేశ్‌ ట్వీట్లు చేస్తూ ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్రగా ప్రజలకు అర్థమైంది’ అని విమర్శించారు. ఓటీఎస్‌ అనేది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమేనన్నారు. వసూళ్లపై వాలంటీర్లు, కార్యదర్శులకు లక్ష్యాలు నిర్దేశించలేదని, కేవలం అవగాహన కల్పించాలని ఆదేశించామని వివరించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని