Rafale: మళ్లీ రఫేల్‌ కాక

ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సంచలన ఆరోపణల కారణంగా మరోసారి వార్తల్లోకెక్కింది! ఆ ఒప్పందాన్ని దక్కించుకునేందుకు తమ దేశానికి చెందిన విమాన

Updated : 09 Nov 2021 11:21 IST

ఒప్పందం కోసం మధ్యవర్తి సుషేన్‌ గుప్తాకు రూ.65కోట్ల ముడుపులు
బోగస్‌ ఇన్‌వాయిస్‌లతో ముట్టజెప్పిన దసో ఏవియేషన్‌
సాక్ష్యాధారాలున్నా దర్యాప్తు జరపని సీబీఐ
ఫ్రాన్స్‌ జర్నల్‌ ‘మీడియాపార్ట్‌’లో సంచలన కథనం

దిల్లీ: ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సంచలన ఆరోపణల కారణంగా మరోసారి వార్తల్లోకెక్కింది! ఆ ఒప్పందాన్ని దక్కించుకునేందుకు తమ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థ దసో ఏవియేషన్‌.. మధ్యవర్తి సుషేన్‌ గుప్తాకు దాదాపు రూ.65 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్లు ఫ్రాన్స్‌ పరిశోధనాత్మక జర్నల్‌ ‘మీడియాపార్ట్‌’ ఆదివారం ఓ కథనంలో వెల్లడించింది. ఇందుకోసం బోగస్‌ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించినట్లు తెలిపింది. సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ.. భారత్‌లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆ ముడుపుల వ్యవహారంలో దర్యాప్తు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొనడం తాజాగా మరింత సంచలనంగా మారింది. ఈ కథనంపై దసోగానీ, భారత రక్షణ మంత్రిత్వ శాఖగానీ ఇంకా స్పందించలేదు. దసో నుంచి 36 రఫేల్‌ విమానాల కొనుగోలు కోసం భారత్‌ రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ‘మీడియాపార్ట్‌’ గతంలో ఆరోపించింది. ఆ ఆరోపణలపై ఫ్రాన్స్‌లో జ్యుడీషియల్‌ దర్యాప్తు జరుగుతోంది.

‘మీడియాపార్ట్‌’ తాజా కథనం ప్రకారం.. మారిషస్‌లో రిజిస్టర్‌ అయిన ఓ బూటకపు కంపెనీ ముసుగులో అగస్టా వెస్ట్‌లాండ్‌ నుంచి సుషేన్‌ లంచాలు స్వీకరించారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు క్రమంలో ఈ విషయం నిర్ధారణ అయింది. సంబంధిత పత్రాలను సీబీఐ, ఈడీలకు మారిషస్‌ అధికారులు 2018 అక్టోబరు 11న పంపించారు. వాటిని పరిశీలించగా.. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి సుషేన్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు బయటపడింది. 2007 నుంచి 2012 వరకు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆయనకు దసో రూ.65 కోట్ల మేర రహస్య కమిషన్లు చెల్లించినట్లు కూడా ఆధారాలు లభించాయి. సుషేన్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ ఖాతాల్లో ఆ సొమ్ము జమ అయింది. రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ 2018 అక్టోబరు 4న సీబీఐకి ఫిర్యాదు అందింది. ఆ తర్వాత వారం రోజులకే మారిషస్‌ నుంచి సంబంధిత సాక్ష్యాధారాలు చేతికందినప్పటికీ రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు ప్రారంభించకూడదనే సీబీఐ నిర్ణయించుకుంది.


‘కార్యాలయాల్లో కూర్చున్నవారు డబ్బు అడుగుతున్నారు’

సో తరఫున కొందరు అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్లు సుషేన్‌ 2012 సెప్టెంబరులో రాసిన ఓ నోట్‌ ద్వారా తెలిసింది. ‘రిస్క్‌ తీసుకున్నాం’, ‘ముడుపులు లేకపోతే నిర్ణయాలు ఉండవు’, ‘కార్యాలయాల్లో కూర్చున్నవారు డబ్బు అడుగుతున్నారు’ ‘మనం డబ్బులివ్వకపోతే.. వారు మనల్ని జైల్లో పెడతారు’ అనే వ్యాఖ్యలు కూడా అందులో ఆయన రాసినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత నోట్‌ ఈడీ వద్ద ఉంది. 2015లో తుది దఫా చర్చలు సాగుతున్నప్పుడు దసో నుంచి కొన్ని రహస్య పత్రాలు సుషేన్‌కు అందాయి. ఒక్కో విమాన ధరను భారత అధికారులు ఎలా లెక్కించారో అందులో స్పష్టంగా ఉంది. సీబీఐ, ఈడీ చేతికందిన పత్రాలు ఈ విషయాలను తేల్చిచెబుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని