ముగ్గురితో సాన్నిహిత్యం.. నచ్చట్లేదు!

నాకు పెళ్లైంది. మూడేళ్ల బాబు. పెళ్లైన కొత్తలో మా ఆయన ఒకమ్మాయితో చాటింగ్‌ చేసేవాడు. తనెవరంటే ‘జస్ట్‌ ఫ్రెండ్‌’ అన్నాడు. ఆ అమ్మాయీ అదే చెప్పింది. తర్వాత వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు.

Updated : 13 Nov 2021 05:17 IST

నాకు పెళ్లైంది. మూడేళ్ల బాబు. పెళ్లైన కొత్తలో మా ఆయన ఒకమ్మాయితో చాటింగ్‌ చేసేవాడు. తనెవరంటే ‘జస్ట్‌ ఫ్రెండ్‌’ అన్నాడు. ఆ అమ్మాయీ అదే చెప్పింది. తర్వాత వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. కొన్నాళ్లకి ఇంకో అమ్మాయితో చాటింగ్‌ చేస్తూ, నేను లేనప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆమెని నిలదీస్తే ‘ఫ్రెండ్స్‌’ అని చెప్పింది. ఇంక ఈమధ్యనే నా భర్త సెల్‌ఫోన్లో వేరొక అమ్మాయివి చాలా ఫొటోలున్నాయి. ఎప్పట్లాగే ‘ఫ్రెండ్షిప్‌ కొద్దీ షేర్‌ చేసింది’ అన్నాడు. ఈమెనీ చెడామడా తిట్టా. ‘మీ ఆయనే నా వెంట పడ్డాడు. విసిగించి పరిచయం చేసుకున్నాడు. ఇకపై మీ భర్తతో మాట్లాడను’ అందామె. ఫొటోలన్నీ డిలీట్‌ చేయించా. తర్వాత కొన్నాళ్లకి నా హజ్బెండ్‌ ఫోన్‌లో మళ్లీ ఆమె ఫొటోలు కనిపించాయి. ఎలా వచ్చాయో తెలియదంటూ బుకాయిస్తున్నాడు. తన తీరుతో విసిగిపోతున్నా. ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఏం చేయాలి?

-కేఎస్‌ఎన్‌, ఈమెయిల్‌

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రెండు మనసులు ఒక్కటైతేనే ప్రేమ. అది లేనప్పుడే సమస్యలు మొదలవుతాయి. గొడవలు, కమ్యూనికేషన్‌ గ్యాప్‌, శృంగార సమస్యలు, ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవడం.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కొన్ని కారణాలు. మొదట్లో మీపై ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదంటే ఏదో మిస్‌ అవుతున్నారని అర్థం. ఒకరు, ఇద్దరు కాదు.. ముగ్గురితో తను సన్నిహితంగా మెలిగాడంటున్నారు. అది స్నేహమా? సాన్నిహిత్యమా? ఆమోదయోగ్యం కాని సంబంధమా? ముందు తేల్చుకోండి. అమితమైన ప్రేమ ఉన్నచోట అనుమానం ఉండటం సహజమే. ఉద్యోగం చేసేచోట అమ్మాయిలతో పరిచయాలుంటాయి. దానికే ఏదేదో ఊహించుకొని అనుమానిస్తే కాపురంలో కలతలు రేగుతాయి. వీటన్నింటికన్నా ముందు మీ శ్రీవారికి నిజంగా మీపై ప్రేమ ఉందా? లేదా? తెలుసుకోండి. మీ భర్తతో మనసు విప్పి మాట్లాడండి. మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో వివరంగా చెప్పండి. అలాగే తను మీకు ఎందుకు దూరమవుతున్నాడో కనుక్కోండి. చెడు దారిలో వెళ్తే పిల్లాడి భవిష్యత్తు ఏంటని నిలదీయండి. సహనం, సమయస్ఫూర్తి, అభిమానంతో మీ భర్తని ఆకర్షించే ప్రయత్నం చేయండి. ఏమీ ఆశించకుండా ప్రేమ పంచితే తప్పకుండా ఆ ప్రేమ తిరిగి దక్కుతుంది. చిన్నచిన్న సమస్యలుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సంసారం నిలబడుతుంది. ఇన్ని చేసినా మీ ఆయనలో ఏ మార్పూ రాకపోతే చివరి ప్రయత్నంగా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించండి. పెద్దల ద్వారా చెప్పించండి. చివరగా ఓ చిన్నమాట. ఏ భర్త అయినా కొన్ని ఆశలు, కొన్ని ఊసులతో పెళ్లి చేసుకుంటాడు. వాటిలో ఏదైనా మీ నుంచి ఆశించి, పొందలేకపోతే ఇతరుల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ అవకాశం ఇవ్వకుండా చూసుకోండి. ఎలా ఉంటే తనకి నచ్చుతారో అడిగి తెలుసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని