రండి.. ప్రపంచాన్ని మార్చేద్దాం

సమాజ గతిని మార్చే అద్భుతమైన ఆలోచన మీ దగ్గర ఉంటుంది... అమలు చేసే మార్గమే తెలియదు! దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించగల ప్రాజెక్టు సిద్ధం చేశారు... పట్టాలెక్కించడానికి పైసలే లేవు! ఈ జాబితాలో మీరున్నారా?

Updated : 06 Nov 2021 05:54 IST

సమాజ గతిని మార్చే అద్భుతమైన ఆలోచన మీ దగ్గర ఉంటుంది... అమలు చేసే మార్గమే తెలియదు! దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించగల ప్రాజెక్టు సిద్ధం చేశారు... పట్టాలెక్కించడానికి పైసలే లేవు! ఈ జాబితాలో మీరున్నారా? ఇలాంటివాళ్ల కోసమే టచ్‌ ఏ లైఫ్‌ స్కౌట్స్‌ సంస్థ ‘గ్లోబల్‌ యూత్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’కి తెర తీసింది. దీనికి ఎంపికైతే మీరు కోరినంత పెట్టుబడి.. ప్రపంచస్థాయి నిపుణుల అండదండలు.. అన్నీ ఉంటాయి.

ఏంటీ ఛాలెంజ్‌: 2030 నాటికి మెరుగైన ప్రపంచం చూడాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం. దీనికోసం పేదరికం, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, స్వచ్ఛమైన నీరు.. ఇలాంటి 17 రకాల స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పని చేస్తోంది. ప్రతి దేశం, ప్రతి వ్యక్తీ ఇందులో భాగస్వాములు కావాలంటోంది. ఈ స్ఫూర్తితో టచ్‌ ఏ లైఫ్‌ స్కౌట్స్‌ స్వచ్ఛంద సంస్థ ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ కార్యక్రమం రూపొందించింది. విద్యార్థులు, యువత ప్రపంచ సమస్యలు, కష్టాలపై ఆలోచించేలా, కలిసి పనిచేసేలా కార్యోన్ముఖులను చేయడమే దీని ఉద్దేశం.

అర్హులెవరు?: ఇరవై రెండేళ్లలోపు వయసున్న యంగిస్థాన్‌లు. www.talscouts.org/transformers- 2021 వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

ఎంపిక: ఐక్యరాజ్య సమితి సూచించిన 17 అంశాల్లో దేన్నైనా ఎంచుకోవాలి. పరిష్కారం చూపించేలా ఏం చేస్తారో వివరించాలి. లేదా ఆ సమస్యకి విస్తృత ప్రచారం కల్పించాలి. లేదంటే సమస్య పరిష్కారానికి తమ ఆలోచనలేంటో చెప్పాలి. మీ ఆలోచన, ఆచరణ నచ్చితే అమలు చేయడానికి టచ్‌ ఏ లైఫ్‌ సిద్ధంగా ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లోంచి ముగ్గుర్ని విజేతలుగా ఎంపిక చేసి నగదు బహుమతినిస్తారు.

భరోసా: అమెరికాలో స్థిరపడ్డ వీణ గుండవెల్లి ఈ సంస్థ వ్యవస్థాపకురాలు. ఈమెతోపాటు పలువురు ప్రముఖులు, వ్యాపార, విద్యావేత్తలు మెంటర్లుగా ఉంటారు. ఎంపికైన యువతకు మార్గనిర్దేశం చేస్తారు. అమెరికాలోని పెద్ద కంపెనీల సీఈవోలకు శిక్షణనిచ్చే ప్రసాద్‌ కైపా, నాస్కామ్‌ మాజీ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌, ‘టై’ హైదరాబాద్‌ ఛాప్టర్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మాజీ హై కమిషనర్‌ గితేశ్‌ శర్మ, రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌ అధిపతి అజిత్‌ రంగ్నేకర్‌.. ఇలాంటి ఉద్ధండులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఎంపికైనవారిని సమాజానికి ఉపయోగపడేలా, బాధ్యతాయుతమైన వ్యాపారం చేసేలా తీర్చిదిద్దాలన్నదే వీరి లక్ష్యం.

యువత చేతుల్లోనే భవిత

చదువైపోగానే ఉద్యోగం, వ్యాపారం, స్టార్టప్‌.. ఏదో ఒకటి ఎంచుకుంటారు యూత్‌. ఆ కెరీర్‌ ఏదైనా యువత ప్రతి అడుగూ సమాజహితంగా మలచాలన్నదే మా కార్యక్రమం లక్ష్యం. దీనికోసం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను ప్రామాణికంగా తీసుకున్నాం. ప్రపంచంలో 160 కోట్లమంది యువత ఉన్నారు. వాళ్లు తమ కెరీర్‌ని బాధ్యతగా భావిస్తే ప్రపంచంపై తప్పకుండా సానుకూల ప్రభావం చూపించగలుగుతారు. సంవత్సరం పొడవునా కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి దశలోనే మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 4 వేలమంది రిజిస్టర్‌ చేసుకున్నారు. భావి నాయకులను తయారు చేసే ఉద్దేశంతో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో వర్చువల్‌ ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని