Civils Exam: తెలుగు మాధ్యమంలో మేలెంత?

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను తెలుగు మాధ్యమంలో రాస్తే విజయం సాధించే అవకాశం ఉంటుందా?

Updated : 02 Dec 2021 11:11 IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను తెలుగు మాధ్యమంలో రాస్తే విజయం సాధించే అవకాశం ఉంటుందా? మాతృభాషలో రాసే అభ్యర్థులు వివక్షకు గురికావాల్సి వస్తుందా? స్టడీ మెటీరియల్‌ దొరుకుతుందా?.. ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులకు వస్తుంటాయి. వీటన్నింటికీ అనుభవజ్ఞులైన బోధన నిపుణులు సూచించే సమాధానాల సమాహారమే ఈ కథనం! 

‘ఇంగ్లిష్‌ కంటే తెలుగులోనే నాకు సౌకర్యంగా ఉంటుంది. నా భావాలను వ్యక్తం చేయడానికి మాతృభాషే అనువుగా ఉంటుంది’ అంటారు కొందరు అభ్యర్థులు. ‘నేను ఇంగ్లిష్‌ మీడియంలో చదివాను. సైన్స్‌ సబ్జెక్టుల మీదే ఎక్కువ దృష్టి పెట్టి ప్రవేశ పరీక్షలు రాస్తున్నాను. ఇంగ్లిష్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు; ఆ అవసరమూ రాలేదు.’ అని కొందరు ఆలోచిస్తుంటారు. ‘పదో తరగతి వరకు తెలుగు మీడియమే. తర్వాత సైన్స్‌/ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులను ఇంగ్లిష్‌ మీడియంలో చదివాను. కానీ నా ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం సివిల్స్‌కు అవసరమైనంతగా లేదనుకుంటున్నా.’ అని మరికొందరు సందేహిస్తుంటారు. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాయాలనుకునేవారికి ఇలా రకరకాల సందేహాలు వస్తుంటాయి. సివిల్స్‌ రాయదలిచిన అభ్యర్థుల్లో వ్యక్తమయ్యే వివిధ రకాల ప్రశ్నలూ.. వాటికి పరిష్కారాలూ తెలుసుకుందాం. 

ఈ పరీక్ష రాయడంలో మీడియం ప్రాధాన్యం ఎంత?

> సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష సాధారణంగా అభ్యర్థుల్లోని వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షిస్తుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల వడపోతే. మెయిన్‌ పరీక్ష అభ్యర్థుల రాత నైపుణ్యాన్నీ, నిర్దేశిత సమయంలో వారి భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్నీ పరీక్షిస్తుంది. ముఖ్యంగా మెయిన్‌ పరీక్షలో మీడియానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చివరి దశలోని ఇంటర్వ్యూలో సమయంలోనూ అభ్యర్థి స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేయడానికి మీడియం ఎంతగానో తోడ్పడుతుంది. 

ప్రిలిమినరీలో ప్రశ్నలు తెలుగు మాధ్యమంలో ఉంటాయా?

> ప్రిలిమినరీలో ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమంలో ఉంటాయి. మరే ఇతర భాషలోనూ ఉండవు. ఒకే బుక్‌లెట్‌లో వరుసలో ఇంగ్లిష్, హిందీల్లో ప్రశ్నలుంటాయి.

ఈ ప్రశ్నపత్రం అన్ని భాషల్లోనూ ఎందుకు ఇవ్వరు?

> ప్రశ్నపత్రాన్ని అన్ని భాషల్లోనూ ఇవ్వడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఒకే ప్రశ్నను అన్ని భాషల్లోకీ అనువదించాలి. అలాగే అనువాదం కచ్చితంగా ఉండేలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఈ పని చాలా క్లిష్టమైంది. ప్రశ్నపత్రాన్ని అన్ని భాషల్లోనూ ఇవ్వాలంటే.. దాన్ని ఎంతోమంది భాషా నిపుణులకు పంపాల్సి ఉంటుంది. పేపర్‌ లీకయ్యే అవకాశాలను పెంచుతుంది. లీకేజీ ఆరోపణలకు ఆస్కారమిస్తుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాంతీయభాషల్లో రాసేవారితో పోలిస్తే అదనపు ప్రయోజనమే లభిస్తుంది. హిందీ కాకుండా ఇతర మాధ్యమాల్లో చదివే విద్యార్థులందరూ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది. 

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటే తెలుగు మీడియం విద్యార్థికి ప్రిలిమ్స్‌లో అర్హత కష్టమవుతుందా?

> ప్రిలిమ్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుందనే సంగతి తెలిసిందే. కాబట్టి పరీక్ష పాసవడానికి సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌లో కనీస అవగాహన సరిపోతుంది. గ్రాడ్యుయేషన్‌ను ఏ మాధ్యమంలో చదివినా ప్రిలిమినరీ మీద ప్రతికూల ప్రభావం ఉండదు. 

ప్రిలిమినరీ పాసైన తర్వాత మెయిన్‌ పరీక్షను తెలుగులో రాసే అవకాశం ఉంటుందా? 

> 1979 నుంచీ మెయిన్‌ పరీక్షను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పిస్తున్నారు. పెరుగుతున్న ప్రాంతీయ ఆకాంక్షలూ, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఇది అవసరమైంది.

మెయిన్‌ పరీక్షలో ప్రశ్నలు తెలుగులో ఉంటాయా?

> మెయిన్‌ పరీక్షలోని ప్రశ్నలు ఇంగ్లిష్‌ లేదా హిందీలో ఉంటాయి. అభ్యర్థులు సొంతంగా వాటిని అనువదించుకుని జవాబులను తెలుగులో రాసుకోవచ్చు. 

ఎక్కువమందా? తక్కువమందా? ఎంతమంది అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తారు?

> తెలుగుమీడియంలో రాస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇటీవలికాలంలో తగ్గుతూ వస్తోంది. యూపీఎస్‌సీ నివేదిక ప్రకారం గత కొద్దికాలంగా తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు.. 

నోట్‌: మెయిన్‌ను ఇంగ్లిష్‌ మీడియంలో రాసి తెలుగులో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అందుకే తెలుగు మీడియంలో మెయిన్‌ రాసి నెగ్గిన అభ్యర్థులే ఇంటర్వ్యూలోనూ తెలుగును ఎంచుకున్నారని చెప్పలేం. సివిల్స్‌ను తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే గ్రామీణ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈమధ్య కాలంలో ప్రిలిమినరీ పరీక్షను కాస్త క్లిష్టంగా ఇస్తుండటంతో మెయిన్స్‌ను తెలుగులో రాసేవారు ఎక్కువమంది ఉండటం లేదు. ప్రిలిమినరీలో సఫలమయ్యే విద్యార్థులు పెరిగితే మెయిన్స్‌లో నెగ్గే విద్యార్థులూ పెరుగుతారు. 

తెలుగు మీడియంలో రాసి నెగ్గిన అభ్యర్థులు ఎక్కువమంది ఉంటారా? 

> తెలుగు మీడియంలో పరీక్ష రాసి టాప్‌-100లో నిలిచినవారు కొద్దిమంది ఉన్నారు. ఈమధ్య కాలంలో గోపాలకృష్ణ 3వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. ఏటూరి భానుప్రకాశ్‌ జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు సాధించారు. సిర్రా కరుణరాజు కూడా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తెలుగు మీడియంలో పరీక్ష రాసి ప్రస్తుతం గ్రూప్‌-ఎ సర్వీసుల్లో ఉన్నవారూ కొంతమంది ఉన్నారు. 

ప్రాంతీయ పక్షపాతం..?

తెలుగు మీడియంలో రాసిన పేపర్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందినవారే దిద్దుతారు కదా? వారు ప్రాంతీయ దురభిమానంతో అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉందంటారు. ఇదెంతవరకు నిజం? 

> యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రాంతీయ పక్షపాతానికి అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రాంతీయ భాషలో పరీక్ష రాసిన ఎక్కువమందికి అధిక మార్కులు వస్తే మార్కులను తగ్గించి, జాతీయ సగటు మార్కులతో సమానమయ్యేలా ఎగ్జామినింగ్‌ బోర్డు చర్యలు తీసుకుంటుంది. దీన్నే స్కేలింగ్‌ అంటారు. కాబట్టి తెలుగు మీడియంలో పరీక్ష రాయడం వల్ల వచ్చే అనుచిత ప్రయోజనం ఏమీ ఉండదు. 

మాతృభాషలో పరీక్ష రాసే ప్రాంతీయ అభ్యర్థులకు నష్టం కలిగేలా పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉంటుందా?

> అలా పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశమే ఉండదు. పరీక్ష విధానం బోర్డు జాతీయ దృక్పథానికి దర్పణం పడుతుంది. ప్రాంతీయ అభ్యర్థుల పట్ల వివక్ష ధోరణితో వ్యవహించే అవకాశమే ఉండదు. నిజానికి ప్రాంతీయ భాషలో సివిల్స్‌ రాసే అభ్యర్థులను యూపీఎస్‌సీ ప్రోత్సహిస్తుంది. 

ఆప్షనల్‌ సబ్జెక్టు సంగతి?

తెలుగు మీడియంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఆప్షనల్‌ సబ్జెక్టుగా దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది?

> తార్కికంగా ఆలోచిస్తే.. వీరు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకోవడం ఎంతో క్షేమదాయకం. దీంతో సమయం ఆదా అవుతుంది. అలా మిగిలిన సమయాన్ని అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అధ్యయనానికి వినియోగించుకోవచ్చు. 

అన్ని సబ్జెక్టులకూ తెలుగులో స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటుందా? 

> ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు సూచించిన అన్ని పుస్తకాలకూ తెలుగు అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. పైగా సబ్జెక్టుకు పునాదిగా భావించే మౌలిక పుస్తకాలను తెలుగు అకాడమీ, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. కోచింగ్‌ సెంటర్లలో.. స్టేట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌కు చెందిన గ్రూప్‌-1 స్టడీ మెటీరియల్‌ తెలుగు మీడియంలోనే అందుబాటులో ఉంది. ఆ సిలబస్‌ 80 శాతం సివిల్స్‌కూ వర్తిస్తుంది. అందుబాటులోలేని అతి తక్కువ భాగాన్ని వెబ్‌సైట్ల నుంచి అనువదించుకోవాల్సివుంటుంది. 

మెయిన్‌ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ కోసం ఎలా సిద్ధం కావాలి? 

> జనరల్‌ స్టడీస్‌ బాగా రాయాలంటే రోజూ వార్తాపత్రికలు చదవాలి. ఇంగ్లిష్, తెలుగు దినపత్రికలు రెండింటినీ చదవడం వల్ల వాటిల్లోని వ్యాసాలను పోల్చి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరైన పదాలనూ ఎంచుకోవచ్చు. ముఖ్యమైన అంశాల మీద తాజా సమాచారంతో నోట్సును సిద్ధం చేసుకోవాలి. ఉపయోగించిన అన్ని పదాలకూ దగ్గరి అనువాదాలను గుర్తించటం మంచిది. 

ప్రతి పదానికీ కచ్చితమైన అనువాదాన్నే వాడాలా? 

> వార్తా పత్రికల్లో ఉపయోగించిన పదాలు వినియోగిస్తే సరిపోతుంది. కచ్చితమైన అనువాద పదాన్నే ప్రయోగించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలకు సరైన అనువాద పదాలు ఉండవు. అలాంటప్పుడు ఇంగ్లిష్‌ పదాలను ఉపయోగించడమే మంచిది. సాంకేతిక పదాల విషయంలో బ్రాకెట్లో ఇంగ్లిష్‌ పదాన్ని రాసే సౌలభ్యాన్ని యూపీఎస్‌సీ కల్పించింది. తార్కికంగా చూస్తే అచ్చమైన తెలుగునే వాడాలనే నియమం ఉన్నప్పటికీ విద్యార్థులు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో కొంతవరకు ఇంగ్లిష్‌ పదాలను వాడేలా సడలింపునూ కల్పించారు. 

ప్రాంతీయ భాషలో ఇంటర్వ్యూకు ఎలా సంసిద్ధం కావాలి? 

> ప్రాంతీయ భాషలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను అందరికంటే చివరగా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డుకు యూపీఎస్సీ అనువాదకుడిని ఏర్పాటుచేస్తుంది. ఈ వ్యక్తి పబ్లిక్‌ సర్వీసెస్‌ లేదా యూనివర్సిటీకి చెందిన నిపుణులై ఉంటారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఇంగ్లిష్‌లో ప్రశ్నలను అడిగితే అనువాదకుడు వాటిని తెలుగులోకి అనువదిస్తారు. అభ్యర్థి తెలుగులో చెప్పిన సమాధానాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించి తిరిగి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అనువాదకుడు తెలియజేస్తారు.  ఇలా అనువాదకుడి సహకారంతో ఇంటర్వ్యూ కొనసాగుతుంది.- వి. గోపాలకృష్ణ డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని