విరామం తర్వాత..

మీరు బీఎస్సీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో చేరి పూర్తిచేసేటప్పటికి మీకు కనీసం 32 సంవత్సరాలు వస్తాయి. ..

Published : 01 Dec 2021 09:49 IST

బీఎస్సీ మొదటి సంవత్సరం (2010) డిస్‌కంటిన్యూ చేశాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవాలనుంది. నాకిప్పుడు 29 ఏళ్లు. ఏ డిగ్రీ చదివితే నాకు ఉపయోగపడుతుంది?

- టి. భవాని

 మీరు బీఎస్సీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో చేరి పూర్తిచేసేటప్పటికి మీకు కనీసం 32 సంవత్సరాలు వస్తాయి. ఆ తరువాత పీజీ చేయాలంటే మరో రెండేళ్లు పడుతుంది. అంటే డిగ్రీ పూర్తిచేశాక కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు వయసు రీత్యా మీకు అర్హత ఉండదు. కానీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు చాలావాటికి మీకు అర్హత ఉంటుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేయడానికి వయసుతో సంబంధం లేదు.
భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారో, ఆ రంగానికి అవసరమైన సబ్జెక్టులతో కూడిన డిగ్రీ చేస్తే మీకు ఉపయోగకరం. ఉదాహరణకు- మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేయాలి. స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాల కోసం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షల కోసం హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులు, డేటా సైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే డేటా సైన్స్‌ కోర్సులు, కౌన్సెలింగ్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే సైకాలజీ కోర్సులు, భాషా పండితులు కావాలనుకొంటే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లాంటి కోర్సులు చేస్తే మేలు. జర్నలిజం రంగంలో చేరడానికి జర్నలిజం కోర్సులు, మేనేజ్‌మెంట్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే బీబీఎ కోర్సులు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగం కోసం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకొంటే ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ లాంటి కోర్సులను చేయవచ్చు. బోధన వృత్తిలోకి వెళ్లాలనుకొంటే ఇంటర్‌ అర్హతతో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ కానీ, బీఎస్సీ/ బీఏతో పాటు బీఈడీ లాంటి కోర్సులు కానీ చేయవచ్చు. కళాశాలలో అధ్యాపకులు అవ్వాలనుకుంటే డిగ్రీ తరువాత మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని