close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్రరాజ్యంలో భారతీయం

ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ అమెరికన్‌ కమలా హారిస్‌
నిర్ణయాన్ని ప్రకటించిన జో బైడెన్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్య రాజకీయాల్లో కీలక ఘట్టం భారతీయ మూలాలున్న సెనేటర్‌ కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేయనున్నారు. శ్వేతజాతికి చెందని నేతను డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎంపిక చేసుకుని అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అన్ని వర్గాలను ఆశ్చర్యపరిచారు. భారతీయ అమెరికన్లు, మరికొన్ని ఇతర వర్గాలవారి ఓట్లు కీలకమని గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన హారిస్‌ (55) తండ్రి జమైకా వాసి కాగా తల్లి భారతీయురాలు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు బైడెన్‌ ఎవరిని ఎంపిక చేస్తారా అనే ఉత్కంఠ అమెరికా రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా ఉంది. దానికి తెరదించుతూ ఆయన తన మద్దతుదారులకు పంపిన సందేశంలో హారిస్‌ పేరును వెల్లడించారు. సుమారు 20 మంది ఆశావహులను వడపోసిన తర్వాత ఆమెకు వీడియో కాల్‌ ద్వారా స్వయంగా ఆయనే ఈ విషయం తెలిపారు. ఈ స్థానం కోసం ఆశించిన ఇతర నేతలకూ ఆయన ఫోన్‌ చేసి, వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు తెలియపరిచారు.

వారం రోజుల్లో జరగనున్న పార్టీ జాతీయ స్థాయి సదస్సులో లాంఛనంగా హారిస్‌ పేరును ఖరారు చేస్తారు. న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన కమలా ప్రస్తుతం సెనేటర్‌గా ఉన్నారు. ఎన్నికల్లో ఉపాధ్యక్ష బరిలో మహిళ ఉంటారని బైడెన్‌ ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. నిజానికి జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ పౌరుడు అమెరికా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తీరు చూశాక అగ్రరాజ్యంలో పెద్దఎత్తున వ్యక్తమైన నిరసనలు పరోక్షంగా ఇప్పుడు హారిస్‌ ఎంపికకు దోహదపడ్డాయి. జాతి వివక్షపై అప్పటి ఆందోళనల్లో ఆమె గట్టిగా గళం వినిపించారు. పోలీసు సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. శ్వేతజాతికి చెందనివారిని ఎంపిక చేయాలనే ఒత్తిడి బైడెన్‌పై వివిధ వర్గాల నుంచి వచ్చింది. దీంతోపాటు మాజీ అధ్యక్షుడు ఒబామా సలహాను పాటించి ఆయన ఈ ఎంపికపై మొగ్గు చూపించారు. హారిస్‌ ఎంపిక చరిత్రాత్మకమని అమెరికాలో ప్రముఖ దిన పత్రికలన్నీ పేర్కొన్నాయి. 2008లో ఒబామాను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించినప్పుడు పతాక శీర్షికల్లో ఆ విషయానికి ప్రాధాన్యం ఇచ్చిన రీతిలోనూ ఇప్పుడూ స్పందించాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.