close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనైతిక శ్రామిక విధానం.. వెట్టిచాకిరీయే

వేతన ప్రయోజనాలు ఆపడానికే పొరుగుసేవల ముసుగు
జీహెచ్‌ఎంసీ చర్య రాజ్యాంగ విరుద్ధం : హైకోర్టు
ఈనాడు - హైదరాబాద్‌

పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్‌) పేరుతో దశాబ్ద కాలంగా జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు, కార్మికులు, ఎంటమాలజీ ఫీల్డ్‌ వర్కర్లు తదితరుల సేవలను పొందుతూ వారిని క్రమబద్ధీకరించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది అనైతిక శ్రామిక విధానమని...శ్రమదోపిడీ...వెట్టి చాకిరీ తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ నేరుగా సేవలను పొందినట్లయితే పెన్షన్‌, పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు క్రమబద్ధీకరణకు కూడా వారు అర్హులేనని పేర్కొంది. వీటిని అడ్డుకోవడానికి పొరుగు సేవల ముసుగు కింద సేవలను పొందుతోందని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో స్పష్టంగా చెప్పినప్పటికీ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించకపోవడం, సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం, మంజూరైన పోస్టులను భర్తీ చేయకుండా సేవలను పొందడం రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేసింది.
రెండు నెలల్లో క్రమబద్ధీకరించాలి
పిటిషనర్ల సేవలను కొనసాగిస్తూనే కాంట్రాక్టర్లు, ఏజెన్సీలతో నిమిత్తం లేకుండా వారు కొనసాగుతున్న పోస్టుల్లో రెండు నెలల్లో క్రమబద్ధీకరణను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. టైమ్‌ స్కేల్‌ ఉద్యోగుల మాదిరి పిటిషనర్లకు కూడా పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి క్రమబద్ధీకరణను పరిశీలించేదాకా సమాన వేతనాలు చెల్లించాలని, ఇప్పటికే కాంట్రాక్టర్‌ ద్వారా చెల్లించిన మొత్తాలను మినహాయించుకోగా ఈ ఏడాది జులై వరకు ఉన్న బకాయిలను సెప్టెంబరు 15 లోగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్లకు పైగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సేవలందిస్తున్నప్పటికీ క్రమబద్ధీకరించకపోవడంపై 2018లో జి.శ్రీనివాసాచారి, మరో 97 మంది హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం క్రమబద్ధీకరించాలంటూ వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోలేదంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. వివిధ ఏజెన్సీల నుంచి అవసరమైన సేవలను పొందుతున్నామని, వారి నియామకం కూడా ఇతర నియామకాలతో పోల్చితే భిన్నమని చెప్పినప్పటికీ ఎంపిక విధానం ఏమిటో జీహెచ్‌ఎంసీ చెప్పలేదు. 2017లో శానిటేషన్‌ వర్కర్లు, ఎంటమాలజీ ఫీల్డ్‌ వర్కర్లు, సూపర్‌వైజర్లకు వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.14 వేల వరకు, అదేవిధంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.13 వేల నుంచి రూ.14,500కు పెంచినా వీరికి నిరాకరించింది.


ప్రపంచస్థాయి నగరంగా మారడానికి నిరంతర శ్రమ

‘హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా మారడానికి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు, కార్మికులు, ఎంటమాలజీ వర్కర్లు, సుపీరియర్‌ ఫీల్డ్‌ వర్కర్ల పోస్టులను రెగ్యులర్‌ నియామకాలతో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను జీహెచ్‌ఎంసీ కౌంటరులో పేర్కొనలేదు. తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో ఏజెన్సీలు, కాంట్రాక్టు కింద సేవలందిస్తున్నారు. వారి నిస్సహాయతను అవకాశంగా తీసుకుని కనీస వేతనాలను నిరాకరించడం శ్రమదోపిడీ చేయడమే. ఇది రాజ్యాంగంలోని అధికరణ 21కు విరుద్ధమే. రెగ్యులర్‌ కార్మికుల మాదిరిగా కాలపరిమితి, నిర్ధిష్ట వేతనం ఇంక్రిమెంట్లు, పెన్షన్‌ ప్రయోజనాలు, మెడికల్‌, పదవీ విరమణ ప్రయోజనాలు పిటిషనర్లకు అందడంలేదు. ఇది అనైతిక శ్రామిక విధానమే. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయడంలో భాగంగా 1970లో తీసుకువచ్చిన చట్టం లక్ష్యం నీరుగారిపోతోంది. కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ విధుల కేటాయింపు, పర్యవేక్షణ అంతా జీహెచ్‌ఎంసీయే చూస్తోంది.  పొరుగు సేవల విధానాన్ని కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమేనని, జీహెచ్‌ఎంసీ నిరంతరం చట్టాన్ని ఉల్లంఘించడాన్ని అనుమతించలేమంటూ 31 పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.