close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీరుట్‌ రక్తసిక్తం

భారీ పేలుడు తీవ్రతకు 100 మందికిపైగా దుర్మరణం
క్షతగాత్రుల సంఖ్య 4 వేలకు పైమాటే
2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు?

బీరుట్‌: అసలే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న బుల్లి దేశం లెబనాన్‌ నెత్తిన భారీ పేలుడు రూపంలో పిడుగు పడింది! దేశ రాజధాని బీరుట్‌లో మంగళవారం సంభవించిన పేలుడు తీవ్ర విధ్వంసం సృష్టించింది. నగరాన్ని అతలాకుతలం చేసింది. 100 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మరో నాలుగు వేల మందికిపైగా గాయపడ్డారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తెగిపడ్డ శరీర భాగాలు.. ముక్కలు ముక్కలైన వాహనాలు.. శిథిలాలుగా మారిన భవనాలతో సంఘటనా స్థలంలో పరిస్థితి భీతావాహంగా కనిపించింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  మరోవైపు రెండు వారాలపాటు ఆత్యయిక స్థితిని విధిస్తున్నట్లు లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.
ఓడరేవు ప్రాంతంలో..
బీరుట్‌లో వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ఓడరేవు ప్రాంతంలో తాజా పేలుడు చోటుచేసుకుంది. ఫలితంగా అక్కడ ధాన్యం నిల్వకు ఏర్పాటుచేసిన గిడ్డంగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వినియోగానికి పనికి రానంతగా ధాన్యం మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. పేలుడుకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. దుర్ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలో తొలుత అగ్నికీలలు రావడం వాటిలో కనిపించింది. అనంతరం మంటలు సమీపంలోని భవనానికి వ్యాపించాయి. ఆపై దిక్కులు పిక్కటిల్లేలా భారీ ధ్వనితో పేలుడు సంభవించింది. దాని తీవ్రతకు.. భూకంపం వచ్చిందా అన్నట్లు కొన్ని కిలోమీటర్ల వరకు భవనాలు కంపించి దెబ్బతిన్నాయి. గాజు కిటికీలు ఊడిపడ్డాయి. వాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. చాలామంది కొన్ని మీటర్ల దూరం వరకు అమాంతం ఎగిరిపడ్డారు.
తేరుకునేదెలా..?
తాజా దుర్ఘటనతో బీరుట్‌లో వేల మంది నిరాశ్రయులయ్యారు. కరెన్సీ సంక్షోభంతో ఇప్పటికే లెబనాన్‌ ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని బీరుట్‌లో విధ్వంసం చోటుచేసుకోవడం, వేల మంది జనం రోడ్డున పడటం దేశానికి శరాఘాతంగా మారింది. ఇక ప్రస్తుతం దెబ్బతిన్నదే లెబనాన్‌లో ప్రధానమైన ఓడరేవు. దాన్నుంచే సింహభాగం ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. ఇప్పుడప్పుడే అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు.
అండగా నిలవండి: లెబనాన్‌ ప్రధాని
పేలుడుతో తీవ్రంగా దెబ్బతిన్న తమకు సహాయం చేయాలని లెబనాన్‌ ప్రధానమంత్రి హసన్‌ డియాబ్‌ తమ మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాము అసలైన విపత్తును ఎదుర్కొంటున్నామని చెప్పారు. బీరుట్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ గుటెరెస్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీరుట్‌లో పేలుడును ప్రమాదంగా తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అది భయానక దాడి అయి ఉంటుందని వ్యాఖ్యానించారు. లెబనాన్‌కు బాసటగా నిలిచేందుకు రష్యా, ఫ్రాన్స్‌, జోర్డాన్‌, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌ తదితర దేశాలు ముందుకొచ్చాయి.
పేలుడుకు కారణమేంటి? భారీ పేలుడు ఎలా చోటుచేసుకుందనే దానిపై ఇప్పటికీ పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదు. ఓ నౌక ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న 2,750కుపైగా టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను 2013లో బీరుట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్థానిక గిడ్డంగిలో నిల్వ ఉంచారు. అది పేలడం వల్లే తాజా దుర్ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని లెబనాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్‌ ఫాహ్మి అభిప్రాయపడ్డారు. కాగా ఓడరేవులో విధులు  నిర్వర్తించే కొందరు అధికారులను గృహ నిర్బంధంలో పోలీసులు ఉంచారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.