close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అయోధ్య మెరవంగా.. రామరాజ్యం దిశగా..

శతాబ్దాల నిరీక్షణకు తెర పడింది
రాముడి జీవితం యుగయుగాలకు ఆదర్శం
ఎన్నో తరాల తపస్సు, త్యాగాల ఫలం రామాలయం
పురుషోత్తముడే మన సంస్కృతికి ఆధారం
అయోధ్య ఆలయ శంకుస్థాపనలో మోదీ వ్యాఖ్యలు

రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడిందని, పరంధాముడి జీవనం యుగయుగాలకు ఆదర్శమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాముడి జీవితం, చరిత్రే గాంధీజీ
కలలుగన్న రామ రాజ్యానికి ప్రేరణ అని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ఆయన సంప్రదాయబద్ధంగా శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చరిత్రాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ.. త్యాగశీలురను కొనియాడారు. రాముడి కీర్తి అజరామరమని శ్లాఘించారు. మన సంస్కృతికి ఆధారమైన పురుషోత్తముడే యుగయుగాలకు ఆదర్శమని చెప్పారు. మోదీ ఏమన్నారంటే..

‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అని రాముడు మనకు నేర్పాడు. మన దేశం ఎంత శక్తిమంతమైందో అంత శాంతియుతంగా ఉండాలన్నదే ఆయన చెప్పిన నీతి, రీతి. వేల ఏళ్లుగా భారత్‌కు అవే మార్గదర్శనం చేశాయి. ఈ సూత్రాల ఆధారంగానే రామరాజ్యం కోసం జాతిపిత గాంధీ కలగన్నారు. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడమే కాదు... తదనుగుణంగా నడుచుకోవాలన్నది రాముని మాట. ఆయన ప్రేరణతోనే భారత్‌ ఇప్పుడు ముందుకెళ్తోంది. ఆయనే మనకు కర్తవ్య పాలనను, బాధ్యతల నిర్వహణను నేర్పారు. మందిరం కోసం శతాబ్దాల తరబడి ఎందరో చేసిన త్యాగం, సంకల్పాల ప్రతీకే ఈరోజు. రామ జన్మభూమి పవిత్ర ఆందోళనలతో ముడిపడిన ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా ఇది చూస్తున్నారు. మనందర్నీ ఆశీర్వదిస్తున్నారు.

 

* రాముడు అప్పజెప్పిన పనులు పూర్తి చేయకుండా నేనెలా విశ్రాంతి తీసుకోగలను?
* రాముడి ద్వారా నేర్చుకున్న పాఠాలు సర్వకాల సర్వావస్థల్లో ప్రపంచానికి ఉపయోగపడతాయి. ఆయన నేర్పిన బాటలో ముందుకెళ్తేనే దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. విడిపోతే వినాశనానికి తలుపులు తెరుచుకుంటాయి. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరినీ కలుపుకొని, అందరి విశ్వాసం చూరగొని, అభివృద్ధికి పాటుపడాలి.
* రామ మందిరం మన సంస్కృతికి ఆధునిక ప్రతీక అవుతుంది. నేను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఆధునిక అనే పద ప్రయోగం చేస్తున్నాను. ఇది మన మన జాతీయ భావనకు, చెక్కు చెదరని విశ్వాసానికి, కోట్లమంది సామూహిక సంకల్ప శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మందిరం.. రాబోయే తరాలకు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది.
* రాముడి అస్తిత్వాన్ని చెరిపేయడానికి చేయాల్సినవన్నీ చేశారు. కానీ రాముడు ఈరోజూ మన మనసులో ఉన్నాడు. మనం ఏ పనిచేయాలన్నా ప్రేరణ కోసం ఆయన వైపే చూస్తాం. అదీ ఆయన అద్భుత శక్తి. ఆయనే మన సంస్కృతికి ఆధారం.

జాతీయ భావనకు ఆధునిక ప్రతీక
ఈరోజు భారత్‌ మొత్తం భావుకతతో నిండిపోయింది. రామ మందిరం మన సంస్కృతి, జాతీయ భావనకు ఆధునిక ప్రతీక అవుతుంది. రాబోయే తరాలకు ఇది ప్రేరణ ఇస్తూనే ఉంటుంది.
ప్రపంచంలో చాలా దేశాలు రామునికి నమస్కరిస్తాయి. ప్రతి దేశం రాముడితో ఏదో ఒక రూపంలో ముడిపడింది. దేశంలో రాముడి అడుగులు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రాంతాలన్నిటినీ కలిపి రామ్‌ సర్క్యూట్‌ రూపొందిస్తున్నాం. ఎవరూ దుఃఖంతో, పేదరికంలో ఉండకూడదన్నదే రాముడి భావన. శరణువేడిన వారిని రక్షించాలని ఆ మహనీయుడు చాటారు.

తపస్సు, త్యాగాలకు ప్రతీక
ఆగస్టు 15వ తేదీ అంటే ప్రజల బలిదానాలకు ప్రతీక. అలాగే రామమందిరం కోసం శతాబ్దాల తరబడి ఎన్నో తరాలు అఖండంగా, అవిరళంగా, నిష్ఠతో ప్రయత్నించాయి. తపస్సు, త్యాగం, సంకల్పాలకు ఫలితమే ఈరోజు. రామ మందిర ఉద్యమంలో సంఘర్షణ ఉంది. సంకల్పమూ ఉంది. త్యాగాలు, బలిదానాలతో ఈరోజు స్వప్నం సాకారమవుతోంది. ఎందరో మహానుభావుల తపస్సు రామమందిర నిర్మాణంలో పునాదిరాళ్లలా పెనవేసుకుపోయింది. అలాంటి వారందరికీ నేను 130 కోట్లమంది భారతీయుల తరఫున శిరసువంచి ప్రణమిల్లుతున్నా.
రాముని సేవలో ఎలాంటి మర్యాదలు పాటించాలో ఇప్పుడు దేశం కూడా అలాంటి మర్యాదలే అనుసరించింది. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు చెప్పినప్పుడు కూడా మనం ఇలాంటి మర్యాదలే పాటించాం. అందరి మనోభావనలను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించారు. ఈ మందిరంతో కేవలం కొత్త చరిత్ర మాత్రమే రాయడం లేదు.. మనకు మనం చరిత్రను పునరుద్ఘాటించుకుంటున్నాం. ఈరోజు దేశ ప్రజలందరి మద్దతుతో రామ మందిర నిర్మాణ పుణ్య కార్యక్రమం ప్రారంభమైంది’’ అని మోదీ చెప్పారు.

- ఈనాడు, దిల్లీ, లఖ్‌నవూ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.