కాస్త దూరం పెట్టండి
close

Published : 03/03/2021 00:27 IST
కాస్త దూరం పెట్టండి

చేతిలో ఫోన్‌ లేకపోతే గడవదు. ల్యాప్‌టాప్‌ ఒడిలో లేనిదే నడవదు. నిజమేగానీ.. ఇలా గ్యాడ్జెట్‌లకు పూర్తిగా బానిసలైతేనే  సమస్య. దేనికైనా కాస్త బ్రేక్‌ ఇవ్వడం అన్నింటికీ మంచిది. మరైతే.. స్క్రీన్‌ టైమ్‌ని తగ్గించుకునేందుకు ఎలాంటి చిట్కాల్ని ఫాలో అవ్వాలి? ఇవిగోండి కొన్ని.. ఫాలో అయితే కచ్చితంగా ఫలితం దక్కుతుంది..

దూరం పాటించాలి..

గత కొన్ని నెలలుగా సామాజిక దూరం పాటించడం బాగా అలవాటైపోయింది. అలాగే.. ఫోన్‌తోనూ దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఫోన్‌ చేతికి అందేంత దూరంలో పెట్టొద్దు. గదిలో ఓ మూలన దూరంగా పెట్టండి. ముఖ్యంగా.. నిద్ర లేవగానే ఫోన్‌ని స్క్రోల్‌ చేస్తూ కూర్చునే వారికి ఇది బాగా పని చేస్తుంది. రోజులో ఏవైనా  నిర్ణీత సమయాల్లోనే (పాకెట్స్‌ ఆఫ్‌ టైమ్‌) గ్యాడ్జెట్‌లను యాక్సెస్‌ చేసేలా షెడ్యూల్‌ చేసుకుంటే మంచిది.

రంగులొద్దు..

తెరల్ని నలుపు, తెలుపులోకి మార్చేయాలి. అంటే.. ‘గ్రేస్కేల్‌’లోకి అన్నమాట. దీంతో ఫొటోలు, వీడియోలు, విజువల్స్‌ ఏవైనా ఎక్కువ సేపు చూసేందుకు ఆసక్తిగా అనిపించదు. దీంతో ఆటోమేటిక్‌గా స్క్రీన్‌టైమ్‌ తగ్గిపోతుంది. ‘మ్యూట్‌ ద కలర్స్‌’ నినాదాన్ని డిజిటల్‌ లైఫ్‌లోకి తీసుకొస్తే మంచిది.

కూతలు కట్‌..

ఫోన్‌ మెసేజ్‌లకు ఒకటి.. వాట్సాప్‌ లాంటి టెక్స్ట్‌ మాధ్యమాలకి ఇంకొకటి.. సోషల్‌ ఫ్లాట్‌ఫామ్‌లకు మరోటి.. ఇలా నోటిఫికేషన్‌ సౌండ్‌లు, బీప్‌లు వస్తూనే ఉంటాయి. విన్నప్పుడల్లా ఎవరో ఏదో పంపించి ఉంటారని ఆలోచించడం.. ఫోన్‌ అందుకోవడం.. ఇలా జరగకుండా ఉండాలంటే? ముఖ్యమైన నోటిఫికేషన్స్‌ని మాత్రమే ఆన్‌లో ఉంచి, మిగతా అన్నింటినీ మ్యూట్‌ చేయడం మంచిది. దీంతో ఫోన్‌పై ధ్యాస కాస్త తగ్గుతుంది. మీలో దాగున్న క్రియేటీవ్‌ ఆలోచనలకు సాన పెట్టేలా ఓ గదిని ప్రత్యేకంగా సిద్ధం చేసుకోండి. దాంట్లో ఎలాంటి డిజిటల్‌ గ్యాడ్టెజ్‌లకు ఎంట్రీ లేకుండా చూడండి. బొమ్మలు గీయడం.. మ్యూజిక్‌ నేర్చుకోవడం.. రచనలు చేయడం.. లాంటివి చేయొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న