బ్లూటూత్‌ పేరు వెనుకున్న కథ..!
close

Updated : 17/11/2020 14:18 IST
బ్లూటూత్‌ పేరు వెనుకున్న కథ..!


(ఫొటో: బ్లూటూత్‌ ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైర్‌లెస్‌ టెక్నాలజీ అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్లూటూత్‌. రెండు డివైజ్‌లను కలపాలంటే బ్లూటూత్‌ను ఉపయోగించాల్సిందే. మొబైల్‌ను హెడ్‌ఫోన్‌తో అనుసంధానం చేయాలన్నా.. డేటా మార్పిడి జరగాలన్నా బ్లూటూత్‌ సాయం లేనిదే పని జరగదు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ, ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు ఈ సాఫ్ట్‌వేర్‌కు బ్లూటూత్‌ అనే పేరు ఎలా వచ్చిందో? నిత్యం పలికే ఈ పేరు ఒకప్పటి చక్రవర్తిది. ఆయన చేసిన పనినే ఈ సాఫ్ట్‌వేర్‌ చేస్తుందని దీనికా పేరు పెట్టారట. అసలు ఆ పేరు వెనకున్న కథమిటో ఏంటో తెలుసుకుందాం రండి..!

ముప్పై ఏళ్ల కిందటే పలు మొబైల్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వైర్‌లెస్‌ టెక్నాలజీపై ప్రయోగాలు ప్రారంభించాయి. 1989లో స్వీడెన్‌కు చెందిన ఎరిక్సన్‌ మొబైల్‌ ‘షార్ట్‌-లింక్‌’ రేడియో టెక్నాలజీని రూపొందించింది. ఇందులో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ జాప్‌ హార్ట్‌సెన్‌ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఇంటెల్‌, నోకియా, ఐబీఎం వంటి సంస్థలు కూడా వైర్‌లెస్‌ టెక్నాలజీపై పరిశోధనలు జరుపుతున్నాయి. సాంకేతిక విప్లవం తీసుకురావడం కోసం ఈ సంస్థలు కలిసి ‘షార్ట్‌-లింక్‌’ను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆయా సంస్థల నుంచి కొందరు ప్రతినిధులు బృందంగా ఏర్పడి సమావేశం నిర్వహించారు. ప్రయోగదశలో వైర్‌లెస్‌ టెక్నాలజీకి తాత్కాలికంగా ఏదైనా పేరు పెట్టాలని భావించారు. ఈ బృందంలో ఒకరైన జిమ్‌ కర్దాచ్‌ ‘బ్లూటూత్‌’ పేరును ప్రతిపాదించారు.

బ్లూటూత్‌ అంటే..?

క్రీస్తుశకం 958-986 మధ్య డెన్మార్క్‌, నార్వేను హరాల్డ్‌ బ్లాట్లాండ్‌ గొర్మ్‌సెన్‌ అనే చక్రవర్తి పరిపాలించాడు. బ్లాట్లాండ్‌ అంటే బ్లూటూత్‌ అని అర్థం. హరాల్డ్‌కు ఒక పన్ను నీలిరంగులో ఉండేదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అందుకే ఆయన పేరులో బ్లాట్లాండ్‌ వచ్చి చేరింది. క్రైస్తవ మతాన్ని డెన్మార్క్‌కు పరిచయం చేసిన హరాల్డ్‌ తన రాజ్యంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే హరాల్డ్‌.. స్కాండినావియా ప్రజలను ఏకం చేసి.. డెన్మార్క్‌, నార్వే దేశాలను కలిపి పాలించాడు.

సాఫ్ట్‌వేర్‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

హరాల్డ్‌ వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒక తెగను ఒక్కచోటకి చేర్చి, డెన్మార్క్‌.. నార్వే దేశాలను పాలించిన తీరుపై ‘ది లాంగ్‌ షిప్స్‌’ అనే నవల వచ్చింది. దాన్ని చదివిన జిమ్‌ కర్దాచ్‌.. 1997లో వైర్‌లెస్‌ టెక్నాలజీకి వర్కింగ్‌ టైటిల్‌గా బ్లూటూత్‌ పేరు ప్రతిపాదించారు. హరాల్డ్‌ రెండు దేశాలను కలిపి పాలించినట్లుగానే.. ఈ వైర్‌లెస్‌ టెక్నాలజీ రెండు డివైజ్‌లను కలుపుతుందని వివరించారు. సంస్థల ప్రతినిధులకు ఈ పేరు నచ్చడంతో ఆమోదించారు. ఈ వైర్‌లెస్‌ టెక్నాలజీకి మార్కెట్లోకి తీసుకొచ్చే సమయంలో శాశ్వత పేరు పెట్టాలని భావించి.. ‘ప్యాన్‌’, ‘రేడియో వైర్‌’ వంటి పేర్లను పరిశీలించారు. కానీ, చివరికి బ్లూటూత్‌ పేరునే ఖరారు చేసి ప్రకటించారు. దీంతో 1998లో ‘బ్లూటూత్‌ స్పెషల్‌ ఇంట్రస్ట్‌ గ్రూప్‌ (ఎస్‌ఐజీ)’ను ఏర్పాటు చేశారు. ఎరిక్సన్‌, ఐబీఎం, ఇంటెల్‌, నోకియా, తోషిబా తొలుత ఈ సంస్థలో సభ్యులు కాగా.. కాలక్రమంలో అనేక సంస్థలు సభ్యత్వం పొందాయి. ఆ బ్లూటూత్‌ టెక్నాలజీ.. ఇప్పుడు అన్ని ఫోన్లలో తప్పనిసరిగా ఉండే ఫీచర్‌గా మారిపోయింది. ఇక ఈ బ్లూటూత్‌ సింబల్‌లో కనిపించే ‘బి’ అక్షరం.. ప్రాచీన డానీష్‌ లిపిలోనిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న