ఫేక్‌న్యూస్‌ కట్టడికి ఫేస్‌బుక్ ఏం చేసిందంటే..
close

Published : 20/11/2020 21:54 IST

ఫేక్‌న్యూస్‌ కట్టడికి ఫేస్‌బుక్ ఏం చేసిందంటే..

(Photo: FBNewsroom)

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో సాధారణ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు తమకు పరీక్ష వంటివని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించడం నుంచి తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయడం వరకు ఫేస్‌బుక్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. అంతేకాకుండా అధ్యక్ష ఎన్నికల కంటే ముందు.. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు అవాస్తవాలను ప్రచారం చేసే 180 మిలియన్ పోస్టులకు  ‘వార్నింగ్ లేబుల్స్‌’ హెచ్చరికలను జారీ చేసినట్లు ఫేస్‌బుక్ సమగ్రత విభాగం వైస్‌-ప్రెసిడెంట్ గై రోసన్‌ తెలిపారు. అలాగే యూజర్స్‌ ఎవరైనా వార్నింగ్ లేబుల్స్‌ ఉన్న సమాచారాన్ని షేర్ చేస్తే దానిపై గ్రే బాక్స్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వార్నింగ్ లేబుల్స్‌ ఉన్న సమాచారాన్ని థర్డ్‌ పార్టీ సంస్థ  పరీక్షించి అవాస్తవాలను తొలగించిందని తెలిపారు. 

వార్నింగ్ లేబుల్స్‌ ఇచ్చేముందు ఫేస్‌బుక్‌ ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది..అది అధికారికంగా ధృవీకరించిందా? లేదా? వంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాల గవర్నరులు చేసే ప్రకటనలు, ప్రధాన మీడియా సంస్థలు ప్రచురించే వార్తలను పరిశీలించడంతో పాటు ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసుకున్న ఎన్నికల సమాచార కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పనిచేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక  ముందే జో బైడెన్‌ గెలిచినట్లు వచ్చిన సమాచారానికి..ఫలితాల తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అధ్యక్షడు ట్రంప్‌ చేసిన పోస్టులకు వార్నింగ్ లేబుల్స్‌ జారీ చేశామని తెలిపారు. అయితే ఫేస్‌బుక్‌ జారీ చేసే వార్నింగ్ లేబుల్స్ సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా వరకు నకిలీ వార్తలను ఫేస్‌బుక్‌ కట్టడి చేయలేకపోయిందని, లేబుల్స్ పనితీరులో లోపాలున్నాయనే విషయం ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు కూడా తెలుసని అభిప్రాయాలు వెలువడ్డాయి. దీనిపై  రోసన్ మాట్లాడుతూ కచ్చితమైన సమాచారాన్ని అందించడమే లేబుల్స్‌ ప్రధాన ఉద్దేశమని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న